ఈటల భూవ్యవహారంపై తహసీల్దార్ కి  రైతుల నివేదిక‌

ఈటల భూవ్యవహారంపై తహసీల్దార్ కి  రైతుల నివేదిక‌

మెదక్​ (వెల్దుర్తి), వెలుగు: మాజీ మంత్రి ఈటెల రాజేందర్​ భూవ్యవహారంపై విచారణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో గల ఈటెల రాజేందర్ కు చెందిన జమున హ్యాచరీస్ వారు అసైన్మెంట్ భూములను కబ్జా చేసినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఇదివరకు పలుమార్లు రెవెన్యూ, విజిలెన్స్​, ఏసీబీ ఆఫీసర్​లు విచారణ జరిపారు. కాగా ప్రభుత్వం భూముల రీసర్వేకు ఆదేశించడంతో రెవెన్యూ అధికారులు జమున హ్యాచరీ చుట్టుపక్కల వ్యవసాయ భూములున్న రైతులకు ఈనెల ఆరో తేదీన నోటీసులు జారీ చేశారు. 25వ‌ తేదీన తహసీల్దార్​ ఆఫీస్​కు వచ్చి లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో నోటీసులు అందుకున్న రైతులు మంగళవారం మాసాయిపేట తహసీల్దార్​ ఆఫీస్​కు వచ్చారు. తమ భూములకు సంబంధించిన వివరాలను తహసీల్దార్ మాలతికి లిఖిత పూర్వకంగా తెలియజేశారు.

అచ్చంపేట గ్రామానికి చెందిన రైతు పెద్ది యాదగిరి తన తండ్రి రాములు పేర సర్వే నెంబర్​  74లో తమకు 4.20 ఎకరాల భూమి ఉండగా .. ఆ భూమిని తన పేరు మీదికి మార్చి పట్టా ఇవ్వమంటే అధికారులు పట్టించుకోలేదని పేర్కొన్నాడు. తమ భూముల నుండే జమున హ్యాచరీ వాళ్లు పౌల్ట్రీ ఫామ్​కు రోడ్లు వేశారని తెలిపారు. తమకు సర్వే నంబర్ 115/ 3, 115/ 4లో మూడు ఎకరాల భూమి ఉండగా ..తమ భూమిలో నుండి తమకు తెలియకుండా మట్టిని తరలించి తమ భూమి ఆనవాలు లేకుండా చేశారని  కట్ల కొండల్​ రెడ్డి, కృష్ణారెడ్డి అనే రైతులు తెలిపారు. ఇలా నోటీసులు అందుకున్న రైతులందరూ తమ సమాధానాలు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. మొత్తం 24 మంది రైతులు తమ భూముల వివరాలను తెలిపారని,  దీనిపై పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని తహసీల్దార్ మాలతి తెలిపారు. జమున హ్యాచరీస్ డైరెక్టర్ ఈటల నితిన్ తరఫున జీఎం మనోహర్ రెడ్డి తహసీల్దార్ మాలతికి వ్రాతపూర్వక సమాధానాన్ని సమర్పించారు. అలాగే సమాచార హక్కు చట్టం కింద సర్వే నంబర్ 81, 130లో గల భూములకు సంబంధించి పహాణీలు, సర్వే మ్యాప్, సబ్ డివిజనల్ నంబరు, సేత్వార్, సీలింగ్ ల్యాండ్​ ప్రొసీడింగ్స్ కావాలని దరఖాస్తు సమర్పించారు.