అక్షయ తృతీయ రోజు గోల్డ్ కాదు.. సీడ్స్ కొంటారు..!

అక్షయ తృతీయ రోజు గోల్డ్ కాదు.. సీడ్స్ కొంటారు..!

సాధారణంగా అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి కొంటారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు అక్షయ తృతీయ రోజు విత్తనాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు విత్తనాలు కొంటే పంటలు సంమృద్ధిగా పండుతాయని రైతులు నమ్ముతారు. ఇవాళ ఉదయం నుంచి సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాపుల దగ్గర రైతుల రద్దీ కొనసాగుతోంది. అక్షయ తృతీయ మంచిరోజు కావడంతో వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభించారు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా రైతులు. జిల్లాలో ఎక్కువగా సాగయ్యే పత్తితో పాటు సోయ విత్తనాలు కొనేందుకు సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాపుల దగ్గర క్యూకట్టారు. దీంతో అన్నదాతలు తీసుకున్న ఈ మంచి నిర్ణయంపట్ల సంతోషం వ్యక్తం చేశారు వ్యాపారులు. ఈ క్రమంలోనే కొంతమంది రైతులకు దుప్పట్లతో సన్మానం చేసి, స్వీట్లు పంచిపెట్టారు. అక్షయతృతీయరోజు అంతా బంగారం, వెండి కొనుగోలు చేస్తే... ఇక్కడి రైతులు విత్తనాలు కొనడం సెంటిమెంట్ గా భావిస్తారు.

గతేడాది పత్తి దిగుబడి తక్కువగా రావడంతో ఊహించిన దానికంటే ఎక్కువ మద్దతు ధర పలికింది. దీంతో ఈసారి పత్తి, సోయ పంటలవైపే ఉమ్మడి రైతులు మొగ్గుచూపుతున్నారు. వానాకాలం 15 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వ్యవసాయశాఖ అధికారులు. జూన్ లో వచ్చే మార్గశిర కార్తే నుంచి  విత్తనాలు వేయడం మొదలు కానుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని చాలాప్రాంతాల్లో నకిలీ సీడ్ డంప్ అయినట్లు తెలుస్తోంది. దీంతో తనిఖీల కోసం వ్యవసాయశాఖ అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. రైతులు కొనుగోలు చేసిన విత్తనాల ప్యాకెట్లు, రసీదులు చివరి వరకు భద్రంగా ఉంచుకోవాలంటున్నారు  పోలీసులు. నకిలీ సీడ్ అమ్మినవారిపై పీడీ యాక్టు కింద కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. అక్షయ తృతీయ నాడు విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు.. వర్షం పడగానే వాటిని వేసేందుకు భూమిని సిద్ధం చేసేపనిలో ఉన్నారు. భూమినే బంగారంగా భావిస్తామని చెప్పారు.