వడ్లు కొనకుంటే సీఎం ఫామ్​హౌజ్​లో పోస్తం

వడ్లు కొనకుంటే సీఎం ఫామ్​హౌజ్​లో పోస్తం
  • లారీలు వస్తలేవు.. వడ్లు కొంటలేరు
  • రాజన్న సిరిసిల్లలో రైతుల రాస్తారోకో
  • దుబ్బాకలో పలు రోడ్ల దిగ్బంధం

రాజన్నసిరిసిల్ల/దుబ్బాక, వెలుగు: వడ్లు కొనడం లేదని, తూకం వేసిన తర్వాత కూడా వారానికి పైగా కొనుగోలు కేంద్రాల్లోనే ఉండాల్సి వస్తోందంటూ రైతులు ఆందోళనకు దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సర్దాపూర్​రైతులు సిరిసిల్ల, కామారెడ్డి మెయిన్​రోడ్డుపై వడ్ల బస్తాలు వేసి రాస్తారోకో చేశారు. లారీలు రాక పది రోజులు దాటిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల పట్టణ సీఐ అనిల్​కుమార్​రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. అప్పడికప్పుడు వడ్లు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. వడ్లు కొనుగోలు చేయాలంటూ వీర్నపల్లి మండలంలో రైతులుఆందోళన నిర్వహించారు. క్వింటాలుకు  రెండున్నర నుంచి మూడు కిలోలు కట్​చేస్తున్నారని చెప్పారు. సిరిసిల్ల ఏఎంసీ వే బ్రిడ్జి తూకంలో లారీ లోడులో 20 క్వింటాళ్లకు పైగా తేడా రావడంతో రైతులు ఆదోళన చేపట్టారు. దీంతో అధికారులు వే బ్రిడ్జిని మూసివేశారు.

కొనకుంటే సీఎం ఫామ్​హౌజ్​లో పోస్తం

కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనడం లేదంటూ దుబ్బాక నియోజకవర్గంలో పలు రహదారులను దిగ్బంధం చేశారు. దౌల్తాబాద్​ మండలం సూరంపల్లి రైతులు సిద్దిపేట–-దౌల్తాబాద్​ రహదారిపై బైఠాయించారు. దుబ్బాక మండలం పోతారెడ్డిపేట గ్రామ రైతులు ఉదయం ఏడు గంటల నుంచి 10 గంటల వరకు  మెదక్​– -సిద్దిపేట రహదారిపై రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. పోతారెడ్డిపేట రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే రఘునందన్​రావు రోడ్డుపై బైఠాయించారు. నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్​స్తంభించింది. సివిల్​ సప్లై జిల్లా అధికారి హరీశ్​వచ్చి ఈ రోజు నుంచి ధాన్యానికి సరిపడా లారీలను పంపించి కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం రఘునందన్​రావు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసిన వడ్లను జూన్​ 10లోగా కొనుగోలు చేయకుంటే సీఎం ఫామ్​ హౌజ్​లో పోస్తామని హెచ్చరించారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిపై రివ్యూలు కాకుండా అధికారులను పిలిపించి కొనుగోళ్లపై రివ్యూలు పెట్టాలని సీఎంకు సూచించారు.