వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతుల నిరసన

వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతుల నిరసన

వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ తెలంగాణ రాష్ర్టంలో పలు చోట్ల రైతులు ఆందోళనలు, నిరసనలు చేపడుతూనే ఉన్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా దోమ మండలం బొంపల్లి వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు నిరసన చేపట్టారు. తమ వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. పరిగి, మహబూబ్ నగర్ ప్రధాన రహదారిపై వరి ధాన్యానికి నిప్పుపెట్టి.. గంటకుపైగా రాస్తారోకో నిర్వహించారు. అధికారులు వెంటనే రావాలంటూ నినాదాలతో హోరెత్తించారు.

రైతుల ఆందోళనలతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఘనీ బ్యాగులు ఇవ్వకపోవడంతో చాలా మంది రైతుల వరి ధాన్యం కల్లాల వద్దే ఉందని, కోనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలించేందుకు లారీలు లేవని, నేరుగా తమను రైస్ మిల్లుల వద్దకు పంపుతున్నారని, అక్కడ తమతో హమాలీ పనులు చేయిస్తున్నారని రైతులు వాపోయారు. కొనుగోలు కేంద్రాల వద్ద వర్షం వస్తే ధాన్యంపై కప్పేందుకు కనీసం టార్పలిన్లు కూడా లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి.. తమ వరి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.