
- సరిపడా యూరియా ఇవ్వడం లేదని రోడ్లపై బైఠాయించి రైతుల నిరసన
సిద్దిపేట రూరల్, వెలుగు: సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరుతూ సిద్దిపేట - ముస్తాబాద్ రహదారిపై రైతులు ధర్నా చేశారు. సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని రాఘవపూర్ గ్రామంలో రైతులకు సరిపడా యూరియా ఇవ్వడం లేదని గ్రామంలోని ప్రధాన రోడ్డు పై భైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఒక్కో పాస్ బుక్ కు రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారని, అన్ని పనులు మానుకుని గంటల తరబడి క్యూ లైన్ లలో వేచి ఉంటే కొద్దిమందికి మాత్రమే బస్తాలను ఇచ్చి, స్టాక్ అయిపోయిందంటున్నారని వాపోయారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రైతులకు కావాల్సిన సరిపడేంత యూరియాను వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
కోహెడ, వెలుగు: కోహెడ పీఏసీఎస్సెంటర్కు మంగళవారం సాయంత్రం యూరియా రావడంతో బుధవారం తెల్లవారు జామున 4 గంటల నుంచే సెంటర్ముందు పట్టా పాస్ బుక్స్తో రైతులు క్యూ కట్టారు. పోలీసుల బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేశారు. 554 బస్తాల యూరియా రాగా సూమారు 300 మంది రైతులకు అందించినట్లు ఏవో సతీశ్తెలిపారు. కోహెడ మండలానికి సరిపడ యూరియాను సరఫరా చేసి రైతుల కష్టాలను తీర్చాలని ఏఎమ్సీ చైర్‌పర్సన్ నిర్మల, వైస్ చైర్మన్తిరుపతిరెడ్డి, కలెక్టర్హైమావతికి వినతిపత్రం అందజేశారు.
యూరియా కోసం రైతుల రాస్తారోకో
మెదక్/చేగుంట, వెలుగు: యూరియా కొరత నిరసిస్తూ బుధవారం చేగుంట - గజ్వేల్ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. సరిపడ యూరియా వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మండల పరిధి ఇబ్రహీంపూర్ లో యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదంటూ నినాదాలు చేశారు. ఒక్క బస్తా యూరియా కోసం రోజంతా పస్తులతో క్యూలో నిల్చుని ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.