ఢిల్లీలో రోడ్లు బ్లాక్ నేడు భారత్ బంద్​

ఢిల్లీలో రోడ్లు బ్లాక్  నేడు భారత్ బంద్​
  • పంజాబ్​లో రైతుల రైల్ రోకో
  • పట్టాలపై కూర్చొని నిరసన
  • పలు రైళ్లను దారిమళ్లించిన రైల్వే అధికారులు
  • నేడు భారత్ బంద్​కు పిలుపు
  • ఢిల్లీ బార్డర్​లో వెనక్కి తగ్గని అన్నదాతలు

లూధియానా/హోషియాపూర్: ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం పంజాబ్​లో రైతులు ‘రైల్ రోకో’ చేపట్టారు. పట్టాలపై కూర్చొని నిరసన తెలిపారు. హర్యానా పోలీసుల తీరును ఖండించారు. రైతులపై టియర్ గ్యాస్, వాటర్ కెనాన్​లు ప్రయోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహా), బీకేయూ దకుండా (ధనేర్) రైతు సంఘాల పిలుపు మేరకు గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా రైల్ రోకో చేపట్టారు. దీంతో ఢిల్లీ, అమృత్​సర్ రూట్​లో ప్రయాణిస్తున్న రైళ్లను అధికారులు చండీగఢ్ (ఢిల్లీ సైడ్), లోహిన్ ఖాస్ (అమృత్​సర్, జలంధర్ సైడ్) మీదుగా డైవర్ట్ చేశారు. ఢిల్లీ నుంచి బయలుదేరిన శతాబ్ది, షాన్ ఏ పంజాబ్ ఎక్స్​ప్రెస్ ట్రైన్స్​ను లూధియానా రైల్వే స్టేషన్​కు మళ్లించారు. అదేవిధంగా, హైవేపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద కూడా రైతులు ధర్నా చేపట్టారు. వెహికల్స్ కు టోల్ వసూలు చేయకుండా పంపించాలని అక్కడి అధికారులపై ఒత్తిడి చేశారు. జలంధర్ – పఠాన్​కోట్ నేషనల్ హైవేపై ఉన్న రెండు టోల్ ప్లాజాల వద్ద రైతులు నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, శుక్రవారం సంయుక్త్ కిసాన్ మోర్చా(ఎస్​కేఎం)  భారత్ బంద్​కు పిలుపు ఇచ్చింది.

స్టూడెంట్స్​కు ఇబ్బందుల్లేకుండా ఎగ్జామ్స్

టిక్రి బార్డర్ వద్ద ఉన్న రెండు స్కూల్స్​లో బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. స్టూడెంట్స్​కు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పోలీసులు వారిని తమ వెహికల్స్​లో ఎగ్జామ్ సెంటర్లకు తీసుకెళ్లారు. తల్లిదండ్రులతో కలిసి టూ వీలర్స్​పై ఎగ్జామ్ రాసేందుకు వెళ్తున్న వారిని టిక్రి బార్డర్ దాటేందుకు పోలీసులు అనుమతిచ్చారు.

చెవులకు చిల్లులు పడే సౌండ్ సిస్టమ్..

ఢిల్లీలో భద్రతను పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో ఉన్న టిక్రి, సింఘు పాయింట్లను క్లోజ్ చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యూపీ వైపు ఉన్న ఘాజిపూర్ బార్డర్​ను కూడా పోలీసులు మూసివేశారు. అదేవిధంగా, పంజాబ్, హర్యానా మధ్య ఉన్న అంబాలా దగ్గరలో ఉన్న శంభు బార్డర్ వద్ద కూడా భద్రత పెంచారు. సింఘు బార్డర్​లో చెవులకు చిల్లులు పడే భారీ సౌండ్ సిస్టమ్​ను ఏర్పాటు చేశారు. వీటిని లాంగ్ రేంజ్ అకోస్టిక్ డివైజ్ అని పిలుస్తారు.

రైతులతో కేంద్ర మంత్రుల చర్చలు

చండీగఢ్​లో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద్ రాయ్​తో రైతులు సమావేశం అయ్యారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలనే అంశం పై మాట్లాడారు. అయితే, ఈ పరిస్థితుల్లో ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించలేమని కేంద్ర మంత్రులు మరోసారి రైతులకు చెప్పినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే రెండుసార్లు జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. ఆందోళనలు విరమించాలని యూనియన్ నేతలకు కేంద్ర మంత్రులు సూచించగా.. దానికి వారు ససేమిరా అన్నట్టు తెలిసింది. తమ డిమాండ్లు నెరవేర్చేదాకా ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేసినట్టు సమాచారం. డిమాండ్లు నెరవేర్చకపోతే దఫాల వారీగా ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించినట్టు అధికార వర్గాల సమాచారం.