రైతుల సబ్సిడీ యూరియా దారిమళ్లింపు

రైతుల సబ్సిడీ యూరియా దారిమళ్లింపు

బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నరని రాష్ట్రాలకు కేంద్రం లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రాష్ట్రాలు అలర్ట్‌గా ఉండాలని సూచన 

ఫెర్టిలైజర్లను ముడిసరుకుగా వాడే ఇండస్ట్రీలపై నిఘా పెట్టాలె  

ఎఫ్‌సీవో యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలె 

హైదరాబాద్, వెలుగు: రైతులకు సబ్సిడీపై సప్లై చేస్తున్న యూరియా పక్కదారి పడుతోందని, ఈ విషయంలో రాష్ట్రాలు అలర్ట్ గా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. సాగు అవసరాల పేరుతో యూరియా బ్లాక్ మార్కెట్ దందా నడుస్తోందని, దీనిని అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. సబ్సిడీపై ఇచ్చే యూరియాతో పాటు ఇతర కాంప్లెక్స్​ఎరువుల సేల్స్​ఇటీవలి కాలంలో విపరీతంగా పెరగడమే ఇందుకు ఉదాహరణ అని కేంద్రం తెలిపింది. ఇండస్ట్రీస్, వ్యవసాయేతర వాడకానికి సబ్సిడీ యూరియాను మళ్లించడం వల్ల భవిష్యత్తులో అగ్రికల్చర్ సెక్టార్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే యూరియాను అందుబాటులో ఉంచినా, ఇంకా కొరత అనే మాట విన్పిస్తోందని, యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వివరించింది. సబ్సిడీ యూరియా కంటే నాన్ అగ్రికల్చర్ యూరియా ధరలు చాలా ఎక్కువగా ఉన్నందున స్మగ్లింగ్ జరుగుతోందని కేంద్ర ఫెర్టిలైజర్స్ మినిస్ట్రీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

రాష్ట్రంలో భారీగా సేల్స్ 

రాష్ర్టంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో యూరియా భారీగా అమ్ముడుపోయిందని కేంద్రం పేర్కొంది. టాప్–20 బయ్యర్స్​లిస్ట్​అడిగినప్పటికీ సరైన వివరాలు అందలేదని చెప్పింది. సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ, యూరియా సేల్స్ విపరీతంగా పెరగడం ఆందోళనకర విషయమని.. ఫీల్డ్​లో ఏం జరుగుతోందో చెప్పాలని సూచించింది. పీవోఎస్​ మిషన్లు పెట్టి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని అనుకుంటున్నా, కొందరు వాటిల్లోనూ అవకతవకలకు  పాల్పడుతున్నారని  వివరించింది. రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ ​నుంచి సెప్టెంబర్ ​వరకు10.47 లక్షల టన్నుల యూరియా సేల్​అయింది. అదే 2019లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్​ వరకు 7.55 లక్షల టన్నులే అమ్మకాలు జరిగాయి.  ప్రతి జిల్లాలోనూ సేల్స్ 30 శాతానికి పైగా పెరిగాయి. కొందరు యూరియా బస్తాలను అక్రమంగా స్టోర్ చేసుకుంటున్నట్లు రాష్ట్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లోనూ వెల్లడైంది.

ఇండస్ట్రీలపై నిఘా పెట్టాలె

రైతులకు సరఫరా చేస్తున్న యూరియాపై టన్నుకు రూ. 13 వేల సబ్సిడీని భరిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. సబ్సిడీ యూరియా కోసం ఏటా రూ. 70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొంది. సబ్సిడీ యూరియా పక్కదారి పట్టకుండా లా ఎన్ ఫోర్స్​మెంట్ ​సంస్థలు, విజిలెన్స్​ పర్యవేక్షణ చేపట్టి ఫెర్టిలైజర్​ కంట్రోల్ ఆర్డర్​(ఎఫ్ సీవో)1985 ప్రకారం రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కోరింది. యూరియా, ఇతర ఎరువులను ముడి సరుకుగా వాడే కంపెనీలు గుర్తించి నిఘా పెట్టాలని తెలిపింది. పశువులు, పెయింట్, వార్నిష్, వినీర్​షీట్స్, ప్లైవుడ్, కంపెనీల్లో ఎరువులను ముడిసరుకుగా వాడతారని, రాష్ట్రంలో ఇండస్ట్రీలు 2 వేలకు పైనే ఉన్నాయని తెలిపింది.

For More News..

గెస్ట్ లెక్చరర్లకు ఇంటెలిజెన్స్ వర్గాల ఫోన్లు

టీఎస్‌‌‌‌పీఎస్సీ చైర్మన్ రేసులో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌‌‌‌లు

నయీం ఇంట్లో 24 గన్స్ ఎక్కడివి? 602 సిమ్ కార్డుల కాల్ డేటా సంగతేంది?