రైతు కోసం దండులా కదిలిన ఊరు

రైతు కోసం దండులా కదిలిన ఊరు
  •  ఆత్మహత్యాయత్నం చేసిన జైపాల్ రెడ్డి కుటుంబానికి బాసటగా నిలిచిన కజ్జర్ల
  •  విత్తనాలు నాటిన గ్రామస్తులు
  • తమ ఊరి భూముల జోలికొస్తే ఊరుకోబోమని హెచ్చరిక

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన రైతు యాల్ల జైపాల్ రెడ్డి కుటుంబానికి ఊరు ఊరంతా బాసటగా నిలిచింది. జైపాల్​రెడ్డి పొలానికి వెళ్లిన గ్రామస్తులు దుక్కి దున్ని విత్తనాలు వేశారు. తమ ఊరి భూముల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. 36 ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూమి, ధరణి కారణంగా తమకు కాకుండా పోతోందనే ఆవేదనతో జైపాల్​రెడ్డి, ఆయన కొడుకు చరణ్​రెడ్డి ఆదివారం ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రస్తుతం వాళ్లిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నరు.

చెప్పినట్లే చేశారు..
యాల్ల రాజారెడ్డి 36 ఏళ్ల కిందట అబ్దుల్ ఘనీ అనే వ్యక్తి నుంచి 8 ఎకరాల భూమిని కొన్నాడు. బాండ్ పేపర్‌‌పై సంతకాలు చేసుకున్నా.. పట్టా మాత్రం చేయించుకోలేదు. తర్వాత జైపాల్​రెడ్డి ప్రయత్నించినా ఘనీ కుటుంబసభ్యులు సహకరించలేదు. తీరా సాదాబైనామాలను క్రమబద్ధీకరించకుండానే సర్కారు ధరణి తేవడంతో భూమి అబ్దుల్​ఘనీ పేరిట రాగా, ఆయన వారసులు పట్టా చేయించుకున్నారు. ఈ క్రమంలో ఘనీ కొడుకులు ఆసిఫ్, యూసుఫ్, తమ అనుచరులతో కలిసి వెళ్లి భూమిని తమకు అప్పగించి వెళ్లిపోవాలని జైపాల్​రెడ్డి, ఆయన కొడుకు చరణ్​రెడ్డిపై ఆదివారం దాడి చేశారు. కలత చెందిన తండ్రీ కొడుకులు ఆత్మహత్యకు యత్నించారు. ఘటన గురించి తెలుసుకున్న గ్రామస్థులంతా ఆదిలాబాద్ తరలివెళ్లి బాధితులు చికిత్స పొందుతున్న రిమ్స్ ఎదుట హైవేపై ధర్నాకు దిగారు. జైపాల్​రెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆఫీసర్లు స్పందించకుంటే అంతా కలిసి వెళ్లి జైపాల్​రెడ్డి పొలాన్ని తామే స్వయంగా దున్ని విత్తనాలు వేస్తామని చెప్పారు. అన్నట్లే సోమవారం ఉదయం కజ్జర్ల గ్రామానికి చెందిన సుమారు 200 మంది రైతులు, మహిళలు దండులా కదిలారు. గ్రామస్తులే అరకలు, ట్రాక్టర్లు తెప్పించి పొలం దున్నారు. కజ్జర్ల గ్రామ సర్పంచ్ మొట్టే వెంకటమ్మ కిరణ్ అరక పట్టగా, మహిళలు విత్తనాలు వేశారు. జైపాల్​రెడ్డికి తామంతా అండగా ఉంటామని, తమ ఊరి భూముల జోలికి వస్తే కబడ్దార్ అని హెచ్చరించారు.

ముగ్గురు అరెస్టు
దాడి ఘటనలో సోమవారం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ రఘుపతి తెలిపారు. అబ్దుల్ ఆసీఫ్, సిందే మారుతి, రమకాంత్‌లను రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. మరో 15 మంది నిందితులు ఉన్నట్లు తెలిసిందని, వారందరినీ త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.