వడ్ల టోకెన్ల కోసం రైతుల పడిగాపులు

వడ్ల టోకెన్ల కోసం రైతుల పడిగాపులు
  • మార్కెట్లు, ఆఫీసుల వద్ద రైతుల పడిగాపులు
  • రాత్రుళ్లు కూడా క్యూ లైన్లలో వెయిటింగ్​
  • టోకెన్​ ఉంటేనే కాంటా వేస్తామంటున్న ఆఫీసర్లు
  • కొన్ని చోట్ల రోజుకు 300 టోకెన్లు కూడా ఇస్తలేరు
  • సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో తోపులాట
  • రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ఇదే పరిస్థితి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే.. దాన్ని అమ్ముకోవడానికి రైతులు గోస పడాల్సి వస్తున్నది. అమ్ముకుందామంటే ఆఫీసర్లు టైమ్​కు టోకెన్లు ఇవ్వక సతాయిస్తున్నారు. ఈ వానాకాలం సీజన్‌‌‌‌లో వరి పంట వేసిన దగ్గర నుంచి అమ్ముకునే వరకు రైతులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. భారీ వర్షాలతో పంట దెబ్బతినగా.. దానికి తోడు దోమపోటు మరింత నష్టం మిగిల్చింది. ఇప్పుడు చేతికొచ్చిన ఆ కొద్ది వడ్లనైనా అమ్ముకుందామంటే కొనుగోలు సెంటర్ల దగ్గర పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. టోకెన్ల కోసమే గంటల తరబడి క్యూ లైన్లలో రైతులు ఎదురుచూస్తున్నారు. తిండి తిప్పలు మాని రాత్రిళ్లు అక్కడే ఉంటున్నారు. టోకెన్ల కోసం రైతులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో యార్డుల వద్ద తోపులాట జరుగుతుతోంది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మార్కెట్​ యార్డులో శుక్రవారం తోపులాట జరిగి కొందరు రైతుల అంగీలు చినిగాయి.

టోకెన్లు దొరుకుతలేవు

పంట అమ్ముకోవడానికి అగ్రికల్చర్​ ఆఫీసర్లు జారీ చేస్తున్న టోకెన్లు రైతులకు సరిగ్గా అందడం లేదు. మార్కెట్​ యార్డుకు వడ్లు  తెచ్చిన రైతులు.. టోకెన్ల కోసమే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తున్నది. సీరియల్‌‌‌‌ రాయించుకొని ట్రాక్టర్లలో వడ్లను కొనుగోలు సెంటర్లకు తెచ్చినా టోకెన్‌‌‌‌ ఉంటేనే కాంటా పెడుతున్నారు. టోకెన్లు అడిగితే.. అయిపోయాయని ఆఫీసర్లు చెప్తున్నారని రైతులు అంటున్నారు. కొన్ని యార్డుల్లో రోజుకు మూడు నాలుగు వందల టోకెన్లు కూడా ఇవ్వడం లేదు.

ట్రాక్టర్ల కిరాయి ఎక్కువ అడుగుతున్నరు

అసలే ట్రాక్టర్‌‌‌‌లు దొరుకుతలేవు. తీరా ట్రాక్టర్లతో వడ్లను మార్కెట్​కు తెచ్చిన రైతులకు టోకెన్లు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  టైంకు ఆఫీసర్లు టోకెన్లు ఇవ్వడం లేదంటూ చాలా ప్రాంతాల్లో రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. ట్రాక్టర్‌‌‌‌ మీద వడ్లు తీసుకొస్తే కాంటా పెట్టక పోయే సరికి  ట్రాక్టర్‌‌‌‌ ఓనర్లు వెయిటింగ్‌‌‌‌ చార్జీలు అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్లకు అదనపు  కిరాయి ఎట్ల ఇవ్వాలని గోసపడుతున్నారు.

రెండు మూడు ఊర్లకు ఒకే ఆఫీసర్​

రెండు మూడు ఊర్లకు కలిపి ఒకే ఏఈవో టోకెన్లు జారీ చేయాల్సి వస్తున్నది. ఒక్కో రైతు ఎంత పొలం వేశాడు..? ఎంత దిగుబడి వస్తుంది..? అనేది అంచనా వేసి ఆ రోజు కొనుగోలు సెంటర్లకు వచ్చే రైతులకు టోకెన్లు జారీ చేస్తున్నారు. అయితే.. రెండు మూడు ఊళ్లకు ఒకే ఆఫీసర్​ ఉండటంతో సమస్య తలెత్తుతున్నదని, గంటల తరబడి టోకెన్ల కోసం ఎదురుచూడాల్సి వస్తున్నదని రైతులు అంటున్నారు.  పంట కొనుగోళ్లలో టోకెన్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ కావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

వేలు తెగింది.. అంగీలు చినిగినయ్

నేరేడుచర్ల, వెలుగు: వడ్లు అమ్ముకునేందుకు టోకెన్ల కోసం వెళ్తున్న రైతులు నానా అవస్థలు పడుతున్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మార్కెట్​ యార్డుకు రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అక్కడ టోకెన్​ కోసం కిటికీలో మహిళా రైతు ఇజమూరి జానమ్మ చేయిపెట్టగా అకస్మాత్తుగా తలుపు మూయడంతో ఆమె వేలు తెగింది. దీంతో జానమ్మను పోలీసులు ఆస్ప్రతికి  తరలించారు. టోకెన్ల కోసం శుక్రవారం దాదాపు రెండు వేల మందికి పైగా రైతులు వచ్చారు. దీంతో తోపులాట జరుగగా.. పలువురు రైతుల అంగీలు చినిగిపోయాయి.  కాగా రైతులందరికీ టోకెన్లు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, ఆ పార్టీ కార్యకర్తలు నేరేడుచర్ల మార్కెట్ యార్డు వద్ద ధర్నాకు దిగారు. మిర్యాలగూడ – కోదాడ రోడ్డుపై రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. పోలీసులు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు.