వడ్లు కొంటలేరని రోడ్డెక్కిన రైతులు 

వడ్లు కొంటలేరని రోడ్డెక్కిన రైతులు 

వెలుగు, నెట్‌‌వర్క్: కొనుగోలు సెంటర్లలో వడ్లు కొంటలేరని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు రోడ్డెక్కారు. శనివారం పలు జిల్లాల్లో రైతులు ధర్నాలకు దిగడంతో పాటు వడ్ల కొనుగోలు విషయమై ఆఫీసర్లను నిలదీశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​మండలం జైకేసారంలోని కొనుగోలు కేంద్రంలో వడ్లు ఆలస్యంగా కొంటున్నారని చౌటుప్పల్, ​-వలిగొండ రోడ్డుపై రైతులు బైఠాయించారు. అదనంగా తూకం వేస్తున్నారని, కాంటా వేసిన బస్తాలను మిల్లులకు తరలించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. అదే టైమ్‌‌లో హైదరాబాద్ ​నుంచి రామన్నపేట వెళ్తున్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రైతుల దగ్గరకు వెళ్లి మాట్లాడారు. వడ్ల దిగుబడి ఎక్కువ ఉండడంతో కొనలేకపోతున్నామని, వేరే పంటలు వేసుకోవాలని సూచించారు. దీంతో రైతులంతా ఆయన మీద మండిపడ్డారు. వెంటవెంటనే కొనుగోళ్లు చేస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. 

20 రోజులైనా కొంటలేరు.. 

20 రోజుల నుంచి వడ్లు కొంటలేరని మెదక్​ జిల్లా రేగొడ్‌‌లో రైతులు ఆందోళన చేశారు. మొలకెత్తిన ధాన్యాన్ని రోడ్డుపై పోసి తగలబెట్టారు. టోకెన్ల ప్రకారం వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పి పెద్ద రైతుల ధాన్యాన్ని మాత్రమే తూకం వేస్తున్నారని ఆరోపించారు. అకాల వర్షాలతో వడ్లు తడిసి మొలకలు వచ్చాయని, ఇప్పుడు తమ ధాన్యాన్ని ఎవరు కొంటారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన సంచులను తమకు కావాల్సిన వాళ్లకు పంచేసిన ఆఫీసర్లు.. సంచులు లేవన్న సాకుతో  కొనుగోళ్లు ఆపేశారన్నారు. మీడియాను ఆశ్రయిస్తే వడ్లు కొనబోమని బెదిరిస్తున్నారని వాపోయారు.  

వారం రోజులుగా పడిగాపులు.. 

వడ్లను వెంటనే కొనాలని నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం చౌరస్తా వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. పీఏసీఎస్​ గోదాం దగ్గర వారం నుంచి పడిగాపులు కాస్తున్నా వడ్లు కొనడం లేదని, ఎప్పుడు కొంటారో జిల్లా కలెక్టర్ ​చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే సెంటర్​కు తెచ్చిన వడ్లతో పాటు మొలకొచ్చిన వడ్లను కూడా కొంటామని సొసైటీ  చైర్మన్​నర్సింహారెడ్డి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కాగా, జిల్లాలోని కోస్గి, మద్దూరు మండలాల రైతులు నాచారం గ్రామ శివారులోని రైస్ మిల్లుకు తెచ్చిన వడ్లను ఐదు రోజులైనా కాంటా పెట్టడం లేదు. వడ్లతో వచ్చిన వాహనాలన్నీ రోడ్డుపై బారులు తీరాయి. దీంతో తాండూరు–కోస్గి రహదారిపై రైతులు రెండు గంటల పాటు ధర్నాకు దిగారు. పోలీసులు వచ్చి మిల్లు ఓనర్, రైతులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. 

చేతనైతే బయట అమ్ముకోండి: అడిషనల్ కలెక్టర్ రాజేశం

కొనుగోలు సెంటర్‌‌కు తెచ్చిన వడ్లలో తాలు పేరుతో కోతలు పెడుతున్నారని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రైతులు నిరసన తెలిపారు. గత నాలుగైదు రోజులుగా ఇక్కడి రైతులు ఆందోళనలు చేస్తుండడంతో సమస్యలు తెలుసుకునేందుకు కౌటాల మండలం వీరవెల్లికి వచ్చిన అడిషనల్ కలెక్టర్ రాజేశంను రైతులు నిలదీశారు. ఎలాంటి కటింగ్​ లేకుండా వడ్లు కొనాలని వారు డిమాండ్​ చేయడంతో.. రాజేశం వారిపై విరుచుకుపడ్డారు. ‘మీకు చేతనైతే బయటకు వెళ్లి అమ్మకోండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వీళ్లకు అవసరం లేదంటే సెంటర్​ను ఎత్తేయండి’ అంటూ డీఎస్‌‌వో స్వామికుమార్​కు సూచించారు. దీంతో అడిషనల్ కలెక్టర్ తీరుపై రైతులు మండిపడ్డారు.

జొన్నలు కొనాలని బీజేపీ ఆందోళన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఇంటి ముట్టడి 

ఆదిలాబాద్ అర్బన్, వెలుగు: జొన్నలను రాష్ట్ర సర్కారే కొనాలని డిమాండ్ చేస్తూ బీజేపీ లీడర్లు శనివారం ఆదిలాబాద్ లో ఆందోళన చేశారు. రైతులతో కలిసి బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ పాయల్ శంకర్ ​ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఇంటిని ముట్టడించేందుకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. కొంతమంది నాయకులు, కార్యకర్తలను ముందే గృహనిర్బంధం చేశారు. రైతులు జోన్నలను రోడ్డు మీద పోసి నిప్పంటించారు. సర్కార్ తీరును వ్యతిరేకిస్తూ పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు. కాగా, కొందరు లీడర్లు, రైతులు పోలీసులను దాటుకొని కైలాస్​నగర్​లోని ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. మక్కలు వేయొద్దని ప్రభుత్వం చెప్పడంతోనే రైతులు జొన్న సాగు చేశారని, పంట చేతికొచ్చి రెండు నెలలైనా ప్రభుత్వం కొనుగోలే సెంటర్లు ఓపెన్​ చేయలేదని పాయల్​ శంకర్ మండిపడ్డారు. జొన్నల కొనుగోళ్లపై 48 గంటల్లోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.