టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో తన హవా కొనసాగిస్తున్నాడు. ఆడుతుంది ఒకటే ఫార్మాట్ అయినప్పటికీ పరుగుల వరద పారిస్తున్నాడు. క్రికెట్ లో ఎన్నో రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్న విరాట్ ను ఒక అద్భుతమైన రికార్డ్ ఊరిస్తోంది. అదేంటో కాదు అంతర్జాతీయ క్రికెట్ లో 100 సెంచరీలు చేయడం. కోహ్లీ ప్రస్తుతం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతుండడంతో ఈ చారిత్రాత్మక రికార్డ్ చేరుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ మాత్రం కోహ్లీ 100 సెంచరీలు చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లీపై తనకున్న అభిమానం గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత మాజీ బ్యాటింగ్ లెజెండ్ శిఖర్ ధావన్ ఇటీవల తన ఆత్మకథను ఆవిష్కరించారు. శిఖర్ ఇటీవల తన ఆత్మకథ " ది వన్: క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్" ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ధావన్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ 100 సెంచరీల గురించి ప్రస్తావించాడు. కోహ్లీలో పరుగులు చేయాలనే కసి ఇంకా ఉంటే ఒకే ఫార్మాట్‌లో ఆడినప్పటికీ 100 సెంచరీల మార్క్ చేరుకుంటాడు. విరాట్ 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించాలని.. అందరిలాగే ఈ అద్భుతం కోసం తాను ఎదురు చూస్తున్నానని ధావన్ తెలిపాడు.
ఈ కార్యక్రమంలో ధావన్ ఇలా చెప్పాడు.. "కోహ్లీ 100 సెంచరీలు పూర్తి చేయాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. అతని మనసులో పరుగులు చేయాలనే కసి ఉంటే ఈ రికార్డ్ చేరుకోవచ్చు". అని శిఖర్ ధావన్ చెప్పడంతో కోహ్లీపై అతనికి ఎంత అభిమానం ఉందో అని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో 84 సెంచరీలు చేశాడు. ఇటీవలే సౌతాఫ్రికాపై తొలి రెండు వన్డేల్లో సెంచరీలు బాదిన విరాట్ తన సెంచరీల సంఖ్యను 84కు పెంచుకున్నాడు. టెస్టుల్లో 30 సెంచరీలు చేసిన ఈ టీమిండియా దిగ్గజం.. వన్డేల్లో 53..టీ20లో ఒక సెంచరీ చేశాడు. 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే టాక్ ఉంది.
ధావన్ 2024లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2010లో విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గబ్బర్.. డిసెంబర్ 2022లో చివరిసారి భారత జట్టులో కనిపించాడు. ఐసీసీ టోర్నీల్లో అద్భుత రికార్డ్ కలిగి ఉన్నప్పటికీ ఫామ్ లేని కారణంగా 2023 వన్డే వరల్డ్ కప్ జట్టులో ధావన్ ని సెలక్ట్ చేయలేదు. భారత జట్టు తరఫున 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20లు ఆడిన ధావన్.. వరుసగా వన్డేల్లో 6793, టెస్టుల్లో 2315, టీ20ల్లో 1759 పరుగులు చేశాడు. వన్డేల్లో 17, టెస్టుల్లో 7 శతకాలు ధావన్ ఖాతాలో ఉన్నాయి.
