తుమ్మిడిహట్టి కట్టేదెప్పుడు?.నీళ్లిచ్చేదెన్నడు..

తుమ్మిడిహట్టి కట్టేదెప్పుడు?.నీళ్లిచ్చేదెన్నడు..

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగుతుమ్మిడిహట్టి బ్యారేజీ కోసం మంచిర్యాల, ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాల ప్రజలు, రైతులు ఎదురుచూస్తున్నారు. కాళేశ్వరం పేరుతో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు రీ డిజైన్‌‌‌‌‌‌‌‌ చేసి ప్రధాన బ్యారేజీని తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు తరలించిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌ సర్కారు.. డాక్టర్‌‌‌‌‌‌‌‌ బీఆర్‌‌‌‌‌‌‌‌ అంబేడ్కర్‌‌‌‌‌‌‌‌ పేరుతో తుమ్మిడిహట్టి బ్యారేజీ కట్టి తీరుతామని చెప్పింది. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్​లో ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ తూర్పు జిల్లాకు కేవలం 60 వేల ఎకరాల ఆయకట్టే ప్రతిపాదించగా.. తాము ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌, మంచిర్యాల జిల్లాల్లోని 2 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని హామీ ఇచ్చింది. కేసీఆర్​ సర్కార్​ ఈ హామీ ఇచ్చి మూడేండ్లు గడిచిపోతోంది. అయినా.. తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణం కోసం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పనుల కోసం తట్టెడు మట్టి కూడా తీయలేదు. దీనిపై సర్కార్​ను  ప్రతిపక్షాలు కూడా నిలదీస్తున్నాయి. రాజకీయ లొల్లి నడుస్తున్న ఇప్పుడైనా బ్యారేజీ కట్టి తమ పొలాలకు నీళ్లిస్తే బాగుండని ఆ ప్రాంత రైతులు కోరుకుంటున్నారు.

అప్పట్లోనే 71 కి.మీ.ల గ్రావిటీ కాల్వలు

2008లో అప్పటి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును డిజైన్‌‌‌‌‌‌‌‌ చేసింది. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ఎల్లంపల్లి, మిడ్‌‌‌‌‌‌‌‌మానేరు మీదుగా రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల వరకు నీటిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.1919 కోట్లతో తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి అడ్మినిస్ట్రేటివ్‌‌‌‌‌‌‌‌ సాంక్షన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. తుమ్మిడిహట్టి నుంచి మైలారం వరకు రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించే 71 కి.మీ.ల గ్రావిటీ కాలువను తవ్వారు. దాని లైనింగ్‌‌‌‌‌‌‌‌ పనులు కూడా దాదాపు పూర్తి చేశారు. 71 కి.మీ. వద్ద 19 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తే అక్కడి నుంచి జైపూర్‌‌‌‌‌‌‌‌ వాగు ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీళ్లు చేరుతాయి. ఈ పంపుహౌస్‌‌‌‌‌‌‌‌ నిర్వహణకు 250 మెగావాట్ల కరెంట్‌‌‌‌‌‌‌‌ అవసరమని అంచనా వేశారు. కాలువల భూసేకరణ కోసం అప్పుడే ప్రభుత్వం రూ. 900 కోట్లు ఖర్చు చేసింది. వార్దా, వైన్‌‌‌‌‌‌‌‌గంగ నదుల సంగమం తర్వాత ప్రాణహిత నది ప్రారంభమయ్యే తుమ్మిడిహట్టి వద్ద 6.50 కి.మీ.ల పొడవైన బ్యారేజీని డిజైన్‌‌‌‌‌‌‌‌ చేశారు. దీనికి 107 గేట్లు బిగించాలని నిర్ణయించారు. 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం చేయాలని అనుకున్నా.. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోకపోవడంతో అక్కడ ఎలాంటి పనిచేయలేదు. 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే మహారాష్ట్రలో 1,852 ఎకరాల భూమి, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 526 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని లెక్కగట్టారు. నదిగర్భంలో మహారాష్ట్ర వైపునకు 3,395 ఎకరాలు, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ వైపు 376 ఎకరాల భూమి మునిగిపోతుందని అంచనా వేశారు. మొత్తంగా 6,149 ఎకరాల భూమి ముంపునకు గురవుతుండగా.. మహారాష్ట్ర రైతులు ఎకరానికి రూ. 12 లక్షల పరిహారం, మంచి ఆర్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌ ప్యాకేజీ ఇస్తే భూములు ఇచ్చేందుకు తాము సిద్ధమన్నారు. కిరణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఇంజనీర్ల మధ్య బ్యారేజీ నిర్మాణానికి అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌ చేసుకునేందుకు దాదాపు అంగీకారం కుదిరింది. సెక్రటరీల స్థాయిలో చర్చించి, ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుంటే అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌ అయి ఉండేదని రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్లు చెప్తున్నారు. తర్వాత వివిధ కారణాల వల్ల అప్పటి ఉమ్మడి ఏపీ, మహారాష్ట్ర మధ్య చర్చలు నిలిచిపోయాయని వారు పేర్కొంటున్నారు.

గతేడాది వార్దా పేరుతో హడావుడి

తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి సాంకేతిక సమస్య ఉందని ఇరిగేషన్​ అధికారులు గతేడాది తెలిపారు. వార్దా నది, వైన్​గంగా కలిసే చోట తుమ్మడిహట్టి ఉంటుందని, అక్కడ 40 డిగ్రీల కోణంలో కుడివైపునకు తిప్పి బ్యారేజీ నిర్మించాల్సి వస్తుందన్నారు. దీంతో డ్యాం నిర్మాణం, గేట్ల బిగింపులో ఇది అడ్డంకిగా మారుతుందని, బ్యారేజీ డిజైన్‌‌‌‌‌‌‌‌లోనే లోపం ఉందని వారు పేర్కొన్నారు. దీనికి బదులుగా తుమ్మిడిహట్టికి 200 మీటర్ల ఎగువన వార్దా నది వద్ద బ్యారేజీ నిర్మిస్తే బాగుంటుందని సూచించారు. గతేడాది జూలైలో ఈ మేరకు ప్రాథమిక సర్వే కూడా చేశారు. తుమ్మిడిహట్టి వద్ద 120 రోజుల్లో 180 టీఎంసీల నీటి లభ్యత ఉండగా, వార్దాలో నాలుగు నెలల్లో 64 టీఎంసీల నీళ్లున్నట్టుగా సీడబ్ల్యూసీ లెక్కలు చెప్తున్నాయని ఇంజనీర్లు తెలిపారు. ఎన్ని నీళ్లు అందుబాటులో ఉన్నా మంచిర్యాల, ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలకు సాగునీరు ఇచ్చేందుకు వాడుకునేది 20 టీఎంసీలే కాబట్టి తుమ్మిడిహట్టి కన్నా వార్దానే మంచిదని పేర్కొన్నారు. బ్యారేజీ నిర్మాణానికి కేవలం రూ. 600 కోట్లే ఖర్చవుతుందని, 36  గేట్లతో బ్యారేజీ కట్టవచ్చని అంచనా వేశారు. నది గర్భంలోనే నీరు నిల్వ ఉంటుంది కాబట్టి ముంపు సమస్య తలెత్తదని, భూసేకరణే లేనప్పుడు వేగంగా బ్యారేజీ కట్టుకోవచ్చని సూచించారు. ప్రాణహితలో భాగంగా తవ్విన 71 కి.మీ.ల కాలువను ఉపయోగించుకొని సుందిళ్లకు నీటిని తరలించాలని ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో వ్యాప్కోస్‌‌‌‌‌‌‌‌ అప్పట్లో ప్రాజెక్టు ఫీజిబులిటీ సర్వే కూడా పూర్తి చేసింది. బ్యారేజీ నిర్మాణానికి డీపీఆర్‌‌‌‌‌‌‌‌ కూడా సిద్ధం చేసినట్టు అప్పట్లో ప్రచారం జరిగినా అలాంటిదేమి లేదని ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ అధికారులు చెప్తున్నారు.

ఆయకట్టుకు నీరేది?

152 మీటర్ల ఎత్తులో కాకున్న కొన్నాళ్ల క్రితం టీఆర్​ఎస్​ సర్కార్​ మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నట్టుగా 148 మీటర్ల ఎత్తులో తుమ్మడిహట్టి బ్యారేజీ నిర్మించినా మైలారం 138 మీటర్ల ఎత్తులో ఉంటుందని, సుందిళ్ల బ్యారేజీ 130 మీటర్ల ఎత్తులో ఉంటుందని, మైలారం వద్ద ఒక్క లిఫ్టుతో సుందిళ్లతో అవసరం లేకుండానే ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లు చేరేవని రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్లు చెప్తున్నారు. ప్రభుత్వం రీ డిజైన్‌‌‌‌‌‌‌‌ పేరుతో బ్యారేజీని తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు తరలించడంతో ఇక్కడ ప్రతిపాదించిన ఆయకట్టుకు నీరందకుండా పోయిందని వారు అంటున్నారు. ప్రాజెక్టును రీ డిజైన్‌‌‌‌‌‌‌‌ చేసే సమయంలోనూ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ కడుతామని హామీ ఇచ్చారని వారు గుర్తుచేస్తున్నారు.