అకాల వర్షంతో అన్నదాతకు అపార నష్టం

అకాల వర్షంతో అన్నదాతకు అపార నష్టం

ఉమ్మడి జిల్లాలో బుధవారం రాత్రి, గురువారం కురిసిన అకాల వర్షంతో అన్నదాతకు అపారనష్టం వాటిల్లింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లేందుకు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. సత్తుపల్లి, అశ్వారావుపేట, అన్నపురెడ్డి పల్లి, ముల్కలపల్లి, గుండాల, దమ్మపేట మండలాల్లో వర్షం కురిసింది. సత్తుపల్లి మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఆఫీసర్లతో కలిసి ఖమ్మం జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ విజయనిర్మల పరిశీలించారు. అశ్వారావుపేట మండలంలోని గుర్రాల చెరువు, అశ్వారావుపేట, వినాయకపురం, నారాయణపురం, అచ్యుతాపురం, ఉట్లపల్లితో పాటు పలు గ్రామాల్లో అకాల వర్షంతో భారీగా పంట నష్టం జరిగింది. మండలంలో సుమారు 500 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా దెబ్బతిన్నది. కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం, మొక్కజొన్నలు తడిసిపోయాయి. మామిడి, జీడి మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ములకలపల్లి మండలంలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానతో సుమారు వంద ఎకరాల వరి పంటను రైతులు నష్టపోయారు. ములకలపల్లి-పాల్వంచ మెయిన్రోడ్డుపై చెట్లు నేలకొరిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మండలంలోని వీకే రామవరం, ఒడ్డు రామవరం గ్రామాల్లో 60 మంది రైతులకు చెందిన సుమారు వంద ఎకరాల వరి పంట నేలకొరిగింది. మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లపై ఆరబోసిన మొక్కజొన్న, వడ్లు తడిసిపోయాయి. దమ్మపేట మండలంలోని దురదపాడు, గండుగులపల్లి, నాచారం ప్రాంతాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. దమ్మపేట, గొల్గగూడెం, పార్కల గండి ప్రాంతాల్లో అరటి తోటలు నేలవాలాయి.