రిపబ్లిక్ డే వేడుకలకు.. స్పెషల్ గెస్ట్లుగా రైతులు, కార్మికులు

రిపబ్లిక్ డే వేడుకలకు.. స్పెషల్ గెస్ట్లుగా రైతులు, కార్మికులు
  • దాదాపు 10 వేల మందికి ఆహ్వానం

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని కర్తవ్య పథ్​లో జరగబోయే 77వ రిపబ్లిక్ డే వేడుకలకు ఈసారి రైతులు, కర్తవ్య పథ్ భవన్ కార్మికులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. ఆదాయం, ఉపాధి కల్పనలో కృషి, ఉత్తమ ఆవిష్కరణలు, పరిశోధనలు, స్టార్టప్ లు, స్వయం సహాయక బృందాలు, ప్రభుత్వ కీలక కార్యక్రమాల కింద ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని స్పెషల్ గెస్ట్​లుగా కేంద్రం ఆహ్వానించింది. 

జన భగీదారి పెంపు అనే లక్ష్యంతో ఆయా రంగాలకు చెందిన 10 వేల మందిని వారిని జీవిత భాగస్వాములతో సహా ఆహ్వానిస్తున్నట్టు సోమవారం కేంద్ర రక్షణ శాఖ వెల్లడించింది. 

ఇందులో ప్రపంచ అథ్లెటిక్ పారా ఛాంపియన్ షిప్ విజేతలు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు, పప్పు ధాన్యాల స్వావలంబన మిషన్​లో ఉత్తమ పనితీరుతో సబ్సిడీలు పొందిన రైతులు, గగన్​యాన్– చంద్రయాన్ వంటి ఇస్రో మిషన్లలో పాల్గొన్న శాస్త్రవేత్తలు,  ట్రాన్స్ జెండర్లు.. తదితర 53 విభాగాలకు చెందిన వారికి ఆహ్వానాలు పంపినట్టు పేర్కొంది.