భారీ వర్షాలకు మొలకదశలోనే నీటమునిగిన పంటలు

భారీ వర్షాలకు మొలకదశలోనే  నీటమునిగిన పంటలు
  • 2 నెలల్లో ఉమ్మడి జిల్లాలో 25 మంది రైతుల ఆత్మహత్య
  • భారీ వర్షాలకు మొలకదశలోనే  నీటమునిగిన పంటలు 
  • చేసిన అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపం
  • పరిహారంపై రైతులకు భరోసా కల్పించని ప్రభుత్వం
  •  ఇంకా పంట నష్టం పై సర్వే  చేయని అధికారులు

ఆదిలాబాద్, వెలుగు:  ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ రైతు ఆత్మహత్యలతోనే ప్రారంభమైంది. జూన్ మొదటి వారంలో సకాలంలో వర్షాలు పడడంతో రైతులు విత్తనాలు వేశారు. విత్తనాలు కూడా బాగానే మొలకెత్తాయి. కానీ మొలకదశలోనే భారీ వర్షాలు పడడంతో లక్షల ఎకరాలు నీట మునిగాయి. ఇసుక మేటలు వేసి, నేలంతా కోతకు గురై పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గతంలో  ఎన్నడూ లేని విధంగా జులై లోనే నష్టాలు చూడడం.. మళ్లీ పంటలు వేయాల్సి రావడం.. చేసిన అప్పులకు తోడు.. తిరిగి అప్పులు పుడుతాయో లేదోనని మనస్తాపం చెంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు భావిస్తున్నారు.

రెండు నెలల్లో 23 మంది ఆత్మహత్య

 జూన్, జులై నెలల్లోనే  ఉమ్మడి జిల్లాలో 25 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే 16 మంది చనిపోయారు.  గతంలో  నకిలీ విత్తనాలతో పంట ఎదిగి పూత, కాయ దశలో వర్షాలు దెబ్బతీసేవి. ఒకవేళ పంట చేతికొచ్చిన తర్వాత దిగుబడి తగ్గిపోవడం.. గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి కారణాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు.  కానీ ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యానికి  ఆరంభంలోనే పంటలు కోల్పోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎనిమిదేళ్లలో ఉమ్మడి జిల్లాలో 640 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కానీ ఏడాది   జూన్, జులైలోనే ఎక్కువగా ఆత్మహత్యలు నమోదయ్యాయి.

పరిహారం పత్తాలేదు..

జిల్లాలో ఏటా ఏదో విపత్తు కారణంగా రైతులు పంటలు నష్టపోతున్నారు. కానీ నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయమే మరిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం పంట నష్టానికి సంబంధించి ఫసల్ బీమా పథకం అమలు చేస్తోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం  మూడేళ్ల నుంచి ఈ పథకాన్ని పక్కనపెట్టింది. దీంతో వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఇటు ఫసల్ బీమాకు అర్హులు కాక.. అటు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క  రైతులకు బ్యాంకు లోన్లు అందక ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు చనిపోతే రైతు  బీమా కింద రూ.5 లక్షలు అందజేస్తున్న విషయం తెలిసిందే.  అయితే రైతులు ఆత్మహత్య చేసుకున్న టైమ్​లో  కొంత మంది రాజకీయ నాయకులు ప్రభుత్వం బీమా ఇస్తుంది కదా? అనే ఉద్దేశంతో అసలు  జీవోను తెలియకుండా చేస్తున్నారు. 2014లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన  194 జీవో ప్రకారం రైతులు చనిపోతే  వారి అప్పుల తీర్చుకునేందుకు రూ. 6 లక్ష ఇవ్వాలి. దీంతో పాటు ఆ కుటుంబంలోని పిల్లలకు విద్య, వైద్య ఉచితంగా అందించాలని  రైతు సంఘం నాయకులు చెబుతున్నారు. కానీ కేవలం ప్రభుత్వ రైతు బీమా పేరుతో ఆ జీవో ఊసే ఎత్తడం లేదు.

పంట నష్టం అంచనా వేయని అధికారులు..

ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలో 1.03 లక్షల పంటలు దెబ్బతిన్నాయని  అధికారులు ప్రాథమిక అంచనా మాత్రమే వేశారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం   అధికారికంగా పంట సర్వే చేపట్టలేదు.  అధికారులేమో ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని చెబుతుండగా.. ప్రాథమిక అంచనా కంటే పంట నష్టం  ఇంకా ఎక్కువగానే ఉన్నట్లు  తెలుస్తోంది.

ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే ఆత్మహత్యలు

కష్ట కాలంలో  రైతులకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నష్ట పరిహారం, రైతు రుణమాఫీ చేయకపోగా.. బ్యాంకుల నుంచి లోన్లు అందడం లేదు. అప్పులు తీర్చలేక మనస్తాపంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 194 జీవో ప్రకారం రైతు కుటుంబాలకు రూ. 6 లక్షలతో పాటు విద్య, వైద్యం ఉచితంగా అందేలా చూడాలి.  అధికారులు ఈ జీవోపై అవగాహన కల్పించాలి.  

- సంగెపు బొర్రన్న, రైతు ఆత్మహత్యల
నివారణ కమిటీ ప్రెసిడెంట్