ఎవుసం పనిముట్లకు ఆసరేది?

ఎవుసం పనిముట్లకు ఆసరేది?
  • నాలుగేండ్లుగా సబ్సిడీ బంద్
  • బడ్జెట్ కేటాయింపులే తప్ప నిధులియ్యని సర్కారు
  • మూలన పడ్డ ‘యంత్రలక్ష్మీ’..  రైతులకు తిప్పలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: దుక్కులు దున్నుకునేందుకు రైతులకు సబ్సిడీ కింద యంత్రాలు, పనిముట్లు ఇచ్చేందుకు ‘యంత్రలక్ష్మీ’ పథకం తీసుకొచ్చిన సర్కారు దాన్ని సరిగా అమలు చేస్తలేదు. 2014–2015లో ప్రారంభమైన ఈ పథకానికి బడ్జెట్​కేటాయిస్తోంది తప్ప నిధులు విడుదల చేసి యంత్రాలు అందజేయడం లేదు. గత రెండు మూడేండ్ల నుంచి ఇదే పరిస్థితి. 2020-–21 ఏడాదికి సంబంధించి రూ.600.30 కోట్లతో 66,6,458 యంత్రాలు అందించడానికి ప్రణాళికలు రూపొందించినా..  వాటిని అమలు చేయలేదు. నిరుడు బడ్జెట్‌‌‌‌లో ఫామ్‌‌‌‌ మెకనైజేషన్‌‌‌‌ కోసం రూ.1500 కోట్లు కేటాయించిన సర్కారు.. ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. ఈయేడు మొన్నటి బడ్జెట్‌‌‌‌లో రూ.500 కోట్లు ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు కనీసం మార్గదర్శకాలు విడుదల చేయలేదు.

చిన్నయి లేవు.. పెద్దయి రావు

ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు కొడవండ్లు, ఇనుప నాగండ్లు, గొర్రులు, గుంటకలు, ధాన్యంపై కప్పే టార్పాలిన్​కవర్లు, పురుగుమందులు పిచికారీ చేసే హ్యాండ్​స్ప్రేయర్లు 50 నుంచి 60 శాతం సబ్సిడీతో అందించింది. ఇవన్ని చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగపడేవి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత చిన్న వ్యవసాయ పనిముట్లు ఇయ్యని సర్కారు.. యంత్రలక్ష్మి ద్వారా ఇస్తామని ప్రకటించిన రోటవేటర్లు, కల్టీవేటర్ల లాంటి పెద్ద పరికరాలు కూడా ఇవ్వడం లేదు. ఫామ్‌‌‌‌ మెకనైజేషన్‌‌‌‌లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీపై యంత్రాలు, పనిముట్లు అందించాల్సి ఉంది. టెక్నాలజీపై రైతులకు అవగాహన కల్పించి ఆర్థిక సాయం అందించాలి. ఏటా వానాకాలం ప్రారంభంలో మీ-సేవ ద్వారా, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో  రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలి. అయితే ఈసారి సీజన్‌‌‌‌ మొదలైనా అప్లికేషన్లే తీసుకోవడం లేదు. 

హైరింగ్ సెంటర్లు లేవు..

వ్యవసాయ కూలీల కొరత నేపథ్యంలో రైతులకు అండగా నిలవడానికి ఫామ్ మెకనైజేషన్ పేరుతో ప్రభుత్వాలు కొన్ని పథకాలు తీసుకువచ్చాయి. ట్రాక్టర్లు, టిల్లర్లు, వరి నాటే మిషిన్లు, వరి కోసే మిషిన్లు, రొటేవేటర్లు ఇలా యంత్రాలన్నీ సబ్సిడీకి ఇవ్వాల్సి ఉంది. రైతులు నేరుగా కొనలేని భారీ యంత్రాలను కిరాయి తీసుకునేలా కస్టమ్‌‌‌‌ హైరింగ్‌‌‌‌ సెంటర్లను ఏర్పాటు చేయాలి. అధికారులు ప్రణాళికలు రూపొందించినా.. అవి అమలైతలేవు.  

కేంద్రం నిధులు ఆగిపోతున్నయ్‌‌‌‌

రాష్ట్రీయ కృషి వికాస్‌‌‌‌ యోజన, నార్మల్ స్టేట్ ప్లాన్, సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ అనే మూడు పథకాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీతో యంత్రాలు అందిస్తాయి. కేంద్రం అందించే పథకాల్లో కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటా భరించాల్సి ఉంటుంది. గత నాలుగేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా వస్తలేవు. ఇలా రూ. 1000 కోట్లకు పైగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.