ఫాంహౌజ్ కేసు విచారణ డిసెంబర్ 6కు వాయిదా

ఫాంహౌజ్ కేసు విచారణ డిసెంబర్ 6కు వాయిదా

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎన్డీయే కన్వీనర్ తుషార్ వేసిన పిటిషన్ పై హైకోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే, తుషార్ తరఫున మహేష్ జెఠ్మలానీ వాదించారు. ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు కావడంతో హాట్ హాట్ గా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 6 కు వాయిదా వేసింది.

మొదట తుషార్ తరఫున వాదనలు వినిపించిన లాయర్ మహేష్ జెఠ్మలానీ.. రాజకీయ కోణంలోనే ఈ కేసును నమోదు చేశారన్నారు. దర్యాప్తు అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని..కానీ దర్యాప్తు ఆ విధంగా జరగడం లేదని వాదించారు.  సిట్ దర్యాప్తు వివరాలు మీడియాకు లీకు అవుతున్నాయన్నారు. దర్యాప్తు ఎలా జరగాలో పలు హైకోర్టులు ఇచ్చిన తీర్పులను   మహేష్ జెఠ్మలానీ ప్రస్తావించారు. 41A CRPC నోటీసులకు రీప్లై ఇవ్వకుండా లుక్ ఔట్ నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ కేసులో పలు ఉల్లంఘనలు జరిగాయని  మహేష్ జెఠ్మలానీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.  గంటకుపైగా వాదనలు వినిపించిన మహేష్ జెఠ్మలానీ.. సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఈ కేసును దర్యాప్తు చేయించాలని కోరారు.

భోజన విరామం తర్వాత   ప్రభుత్వం తరఫున న్యాయవాది దుశ్యంత్ దవే వాదనలు వినిపించారు.  ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తీవ్ర నేరమయిన కేసుగా పరిగణించాలని   వాదించారు.   ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొని చార్టెడ్ ఫ్లైట్స్  లో తీసుకెళ్లి ప్రభుత్వాలను పడగొట్టారని ఆరోపించారు. కర్ణాటక , మహారాష్ట్ర , మధ్య ప్రదేశ్ , గోవాలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని కోర్టుకు చెప్పారు.  కేసు నమోదయిన మరు క్షణం నుంచే బీజేపీ కేసును వీక్ చేసే ప్రయత్నం చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా  ఈ  కుట్ర జరిగిందన్నారు. ప్రతి రాష్ట్రంలో అపోజిషన్ లీడర్ల మీద  కేసులు పెట్టి  వేధిస్తున్నారని దవే వాదనలు వినిపించారు. కుట్రలు బయటపడటంతోనే బీజేపీ ఆందోళన చెందుతోందన్నారు. తప్పు చెయ్యకపోతే సిట్ దర్యాప్తును ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారని ప్రశ్నించారు.