శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం (అక్టోబర్ 24) ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా పట్టణంలో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ కార్యకర్తల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ సమస్యను లేవనెత్తడానికి పాకిస్తాన్ చేస్తున్న దౌత్య ప్రయత్నాల వల్లే జమ్మూ కాశ్మీర్ ప్రజలు సురక్షితంగా ఉంటున్నారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
కాశ్మీరీల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఉద్దేశాలు సరిగ్గా లేవని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. కాశ్మీరీల సమ్మతి తీసుకోకుండా జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం కాశ్మీరీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండేళ్లు గడుస్తున్నా జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరణలో ఎలాంటి పురోగతి లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర హోదా కల్పిస్తామని పార్లమెంట్, సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ఈ నిరంతర జాప్యం ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలను దెబ్బతీసిందని, ఎన్నికైన పరిపాలన పరిమిత అధికారాలతో పనిచేసేలా చేసిందని పేర్కొన్నారు.
ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వంలో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యంపైన ఫరూఖ్ అబ్దుల్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో ప్రజలచే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వానికి కనీస పరిపాలనా అధికారాలు కూడా లేకుండా చేశారని మండిపడ్డారు. లెఫ్టినెంట్ గవర్నర్ యంత్రాంగం నిరంతరం ప్రభుత్వ పనులకు ఆటంకాలు కలిగిస్తోందని ఆయన ఆరోపించారు.
