సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు వేగంగా అడుగులు..భవనాల నిర్మాణం కోసం మాస్టర్ ప్లాన్

సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు  వేగంగా అడుగులు..భవనాల నిర్మాణం కోసం మాస్టర్ ప్లాన్
  • డిసెంబర్​ 1 కల్లా శంకుస్థాపన, 2027 జూన్​ కల్లా కొత్త భవనాల్లో తరగతుల నిర్వహణ
  • గాంధీ జయంతి నుంచి గిరిజనుల స్థితిగతులపై సర్వే
  • లోగోలో మూడు గిరిజన భాషలు

ములుగు, వెలుగు: గిరిజన విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విద్యను అందించేందుకు ములుగులో ఏర్పాటు చేసిన సెంట్రల్​ ట్రైబల్​ యూనివర్సిటీ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. యూనివర్సిటీకి కేటాయించిన స్థలం చుట్టూ కాంపౌండ్​ వాల్​ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, లోగోలో గిరిజన భాషలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ములుగులో ఏర్పాటు చేసిన యూనివర్సిటీలో ప్రస్తుతం రెండు కోర్సులను ప్రారంభించగా, జాకారం వైటీసీలో క్లాసులు జరుగుతున్నాయి. 

గిరిజన భాషలతో లోగో..

యూనివర్సిటీకి సంబంధించిన లోగో ప్రత్యేకమైన మోటోతో ఉంటుంది. ములుగు యూనివర్సిటీ లోగోలో దేశంలోని మిగిలిన యూనివర్సిటీల మాదిరిగానే సంస్కృత భాషను వినియోగిస్తున్నా, సెకండరీగా తీసుకోనున్నారు. ట్రైబల్​ యూనివర్సిటీ కావడంతో కోయ, గోండు, బంజారా భాషలకు ప్రాధాన్యత ఇచ్చారు. లోగోలో విద్య, వివేక్, వికాస్​ పదాలను వినియోగించనున్నారు. కోయ భాషలో దుం(విద్య), బంజారా భాషలో జ్ఞాన్(వివేక్)​, గోండి భాషలో సుదిరన్(వికాస్)​ పదాలను ఉపయోగించనున్నారు.

 నోడల్  ఆఫీసర్  వంశీ కన్వీనర్ గా, ముగ్గురు ప్రొఫెసర్లు కసిరెడ్డి వెంకట్​రెడ్డి, జయగిరి తిరుమల్​రావు, నారాయణతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి లోగోను రూపొందించారు. ఈ లోగోలో గిరిజన దేవతలు సమ్మక్క, సారలమ్మ, గోండు, కోయ, బంజారాల ఎలిమెంట్లు ప్రతిబింబించేలా చర్యలు తీసుకున్నారు. అక్టోబర్​ 8న అధికారిక లోగోను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అక్టోబర్​ 2నుంచి స్పెషల్​ సర్వే..

ములుగు జిల్లాలో ఆదివాసీలు, గిరిజనుల జీవన విధానం, ఆర్థిక మూలాలపై సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. హైదరాబాద్ లోని సెంట్రల్​ యూనివర్సిటీ ప్రొఫెసర్ల పర్యవేక్షణలో ప్రతి ఆవాస ప్రాంతంలో సర్వే జరుగుతుంది. కల్చర్, సోషియాలజీ ప్రాతిపదికన ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజన, ఆదివాసీల మూలాలు, వారి లైఫ్​స్టైల్, ఆహారపు అలవాట్లు, విద్య, వైద్యం తదితర అంశాలపై సర్వేలో ఫోకస్​ చేయనున్నారు. 

ఈ సర్వేను ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ములుగు జిల్లాలో పూర్తయిన తరువాత రాష్ట్రంలో సర్వే చేపట్టి నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తారు. నివేదిక ఆధారంగా గిరిజన తెగల అభివృద్ధి, వారి ఆరోగ్య స్థితిగతులపై అవగాహన వచ్చే అవకాశం ఉంది.

యూనివర్సిటీ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కోసం మాస్టర్​ ప్లాన్..  

ములుగు సెంట్రల్​ యూనివర్సిటీ భవనాల నిర్మాణం, సౌలతుల ఏర్పాటుపై పీడబ్ల్యూడీ(పబ్లిక్​ వర్క్స్​ డిపార్ట్​మెంట్) అధికారులు మాస్టర్​ ప్లాన్​ రూపొందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే యూనివర్సిటీ ఏర్పాటు కోసం ములుగు గట్టమ్మ వద్ద 287ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పగించింది. మరో 50ఎకరాల్లో ప్లాంటేషన్  కోసం అటవీ భూమిని కేటాయించారు. 

337ఎకరాల స్థలం చుట్టూ రూ.24కోట్లతో 8.4 కిలోమీటర్ల మేర చేపట్టనున్న కాంపౌండ్​ వాల్​ నిర్మాణం కోసం మంత్రి సీతక్క, ఎంపీలు బలరాం నాయక్, జి.నగేశ్​​ఆదివారం శంకుస్థాపన చేశారు. శాశ్వత భవనాల నిర్మాణంలో భాగంగా మాస్టర్​ ప్లాన్​కు అనుగుణంగా డిసెంబర్​ 1 వరకు శంకుస్థాపన చేయనున్నారు. 2027 జూన్  వరకు పర్మినెంట్​ భవనాలు పూర్తి చేసి క్లాసులు నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

వచ్చే ఏడాది కొత్త కోర్సులు..

సెంట్రల్  ట్రైబల్​ యూనివర్సిటీలో ప్రస్తుతం బీఏ హానర్స్​ ఇంగ్లీష్, బీఏ హానర్స్​ ఎకనమిక్స్​ కోర్సులు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం 42మంది చదువుతున్నారు. వచ్చే ఏడాది మరిన్ని కోర్సులతో నోటిఫికేషన్  వస్తుంది. 500 మంది యూనివర్సిటీలో చదువుకునేలా ప్లాన్  చేస్తున్నాం. యూనివర్సిటీ పర్మినెంట్​ స్ట్రక్చర్​ నిర్మాణానికి పీడబ్ల్యూడీ ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు.