ఒక్క పొద్దు ఉంటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి..

ఒక్క పొద్దు ఉంటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి..

శివుడి అనుగ్రహం కోసం ఈ రోజు పచ్చిగంగ కూడా ముట్టుకోకుండా ఉపవాసం ఉంటారు కొందరు. మరికొందరు ఒక్క పొద్దు ఉపవాసం చేస్తారు. ఇంకొందరేమో పండ్లు, నీళ్లతోనే రోజంతా ఉంటారు. ఉపవాసం ఎలా చేసినా... హెల్దీగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి అంటున్నారు న్యూట్రిషనిస్ట్​లు. అసలు ఉపవాసం చేసేవాళ్లు ఏం తినాలి? ఏం తినకూడదు? ఎవరు ఫాస్టింగ్​ చేయకూడదు? ఈ వివరాలన్నీ చెప్తున్నారు చీఫ్​ న్యూట్రిషనిస్ట్​ సుజాత.

వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్యంగా ఉన్నవాళ్లంతా ఫాస్టింగ్​ చేయొచ్చు. దీనివల్ల శరీరానికి లాభమే తప్ప నష్టం లేదు. అదెలాగంటే..శరీరానికి ఫుడ్​ అందనప్పుడు ఇన్సులిన్​ లెవల్స్​ పడిపోతాయి. అప్పుడు గ్లూకగాన్​ అనే హార్మోన్​ యాక్టివ్​ అయి శక్తి కోసం శరీరంలో  పేరుకు పోయిన, పాడైన లేదా చనిపోయిన కణాల్ని వాడుకుంటుంది. అలా పాత కణాలకు బదులుగా కొత్త  కణాలు తయారవుతాయి. దీన్నే ఆటోఫజీ అంటారు. మరి లాభమే కదా అని ఎలాగంటే అలా ఉపవాసం చేయొద్దు. కొన్ని రూల్స్​ ఫాలో కావాలి.

ఈ పద్ధతి వద్దు
కొందరు ఉపవాసం చేసేటప్పుడు మంచి నీళ్లు కూడా తాగరు. దాంతో డీహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు ఎక్కువ. మెదడు నుంచి బాడీపార్ట్స్​కు సిగ్నల్స్​ అందవు. శరీరంలో పేరుకున్న చెత్త బయటికెళ్లదు. ఆ ఎఫెక్ట్​ మెటబాలిజంపై పడుతుంది. కొన్నిసార్లు కండరాలు బిగుసుకు పోతాయి కూడా. అందుకే ఉపవాసం చేస్తున్న వాళ్లు నీళ్లు తాగకుండా ఉండొద్దు. శరీరానికి అవసరమైనన్ని నీళ్లు తాగాలి. మధ్యలో నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, ఫ్రూట్ జ్యూస్​లు, నిమ్మరసం-–తేనె కలిపిన నీళ్లు తాగాలి. రోజంతా ఏమీ తినకుండా టీ, కాఫీలతో సరిపెట్టొద్దు. . 

ఏం తినాలంటే.. 
రోజంతా ఏం తినకపోతే గ్యాస్ట్రిక్​​, అల్సర్​ ప్రాబ్లమ్స్​ వస్తాయి. అందుకే ఎనర్జిటిక్​గా ఉండాలంటే.. మూడు పూటలు ఒక కప్పు ఫ్రూట్స్​ తినాలి. నీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయ తినొచ్చు. ఆరెంజ్, యాపిల్​, దానిమ్మ లాంటి ఫ్రూట్స్​ తింటే బాగా అరుగుతుంది. ఆల్కలైన్​ ఎక్కువగా ఉండే వెజిటబుల్స్, ఆకు కూరల​ సలాడ్​తో పాటు కీరదోస, బీట్​రూట్, క్యాలీ ఫ్లవర్​​ సలాడ్​ తింటే ఉపవాసాల్లో హెల్దీగా ఉండొచ్చు. డ్రై ఫ్రూట్స్​ తింటే అలసట రాదు. చెరకు రసం, వెజిటబుల్​ జ్యూస్​లు కూడా ఎనర్జీ ఇస్తాయి. ఫైబర్​తో నిండిన  గుమ్మడి కాయలు , అరటి, సొరకాయ, బ్రొకోలి  తినడం మంచిది. 

ఏమేం తినకూడదంటే..
కొందరు ఫాస్టింగ్​ చేసేటప్పుడు  పాలు, మజ్జిగ ఎక్కువగా తీసుకుంటుంటారు. దీనివల్ల కొవ్వు​ పెరిగే అవకాశం ఉంది. అందుకని వాటి బదులు ఫ్యాట్​ తీసిన లేదా ఫ్యాట్ తక్కువ ఉన్న పాలు, మజ్జిగ తాగొచ్చు. వీటికి బదులు నట్స్​. అవిసెగింజల్ని తినొచ్చు. వాటిలోని ఫైబర్​ ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంచుతుంది.

దూరంగా ఉండాలి
షుగర్, హైబీపీ ఉన్నవాళ్లు ఉపవాసాలకి దూరంగా ఉండటమే మేలు. అలాగే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, అల్సర్​, గ్యాస్​ట్రబుల్, గుండె సమస్యలు​ ఉన్నవాళ్లు ఉపవాసాలు చేయొద్దు. మెడిసిన్స్​ వాడుతున్నా ఉపవాసం చేయకూడదు. ఎందుకంటే ఉపవాసం వల్ల టైంకి ఫుడ్​ అందక రక్తంలో షుగర్​ లెవల్స్​ పడిపోతాయి. దానివల్ల లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్​ వస్తాయి. అందుకే వీళ్లు కడుపునిండా తినాలి. 

అలాగే  ఉపవాసం చేసిన తెల్లారి ‘నిన్నంతా ఏమీ తినలేద’ని ఎక్కువ తినకూడదు. ఒకేసారి అలా తింటే ఒంట్లోకి ఎక్కువ క్యాలరీలు చేరతాయి. పైగా రాత్రి జాగరణ చేయడం వల్ల మరుసటి రోజు భోజనం చేసి నిద్రపోతారు. దానివల్ల అదనపు ఫ్యాట్​ పెరుగుతుంది. అలాగే ఉపవాసం రోజు ఒంటికి ఎక్కువ పని చెప్పకూడదు. ఎక్సర్​సైజ్​కి దూరంగా ఉండటం మంచిది.  అలాగని అదేపనిగా గంటల కొద్దీ కూర్చోవద్దు.. అటుఇటు తిరగాలి. ఇలా చేస్తే ఆకలి ఫీలింగ్​ రాదు.