మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం.. పెండ్లయిన 15 రోజులకే యువకుడు మృతి

మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం.. పెండ్లయిన 15 రోజులకే యువకుడు మృతి

మహబూబాబాద్, వెలుగు: రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని మంటలు చెలరేగడంతో ఇద్దరు డ్రైవర్లు, ఓ క్లీనర్ సజీవ దహనమయ్యారు. మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామును ఈ ఘటన జరిగింది. వరంగల్ నుంచి ఏపీకి గ్రానైట్ లోడ్ తో వెళ్తున్న లారీ..  విజయవాడలోని హనుమాన్ జంక్షన్ నుంచి గుజరాత్‌‌‌‌కు చేపల దాణా లోడ్‎తో వస్తున్న లారీ.. మరిపెడ మండలం ఎల్లంపేట సమీపంలో వరంగల్ – -ఖమ్మం  హైవేపై ఎదురెదురుగా ఢీకొన్నాయి. గ్రానైట్ బండలు మరో లారీ క్యాబిన్‌‌‌‌లోకి దూసుకెళ్లి డ్రైవర్, క్లీనర్​పై పడ్డాయి. దీంతో వారు బయటకు రాలేకపోయారు. ఇంతలోనే గ్రానైట్ బండలున్న లారీ డీజిల్ ట్యాంక్ పేలిపోయి మంటలు వ్యాపించగా, లారీలో ఉన్న వరంగల్​ జిల్లా వర్ధన్నపేటకు చెందిన డ్రైవర్ గుగులోతు గణేష్(30) సజీవ దహనమయ్యాడు. 

ఎదురుగా ఉన్న లారీకి కూడా మంటలు అంటుకోవడంతో లారీ డ్రైవర్ సర్వర్ రామ్​(23), క్లీనర్ భార్గత్ ఖాన్ (24) కూడా మంటల్లో కాలి మృతిచెందారు. ప్రమాదాన్ని గుర్తించిన సమీపంలోని ప్రజలు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మంటలు  భారీగా ఎగిసిపడడంతో లారీ లోపల ఉన్నవారిని రక్షించలేకపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. అనంతరం రోడ్ పై లారీల శిథిలాలను, గ్రానైట్​రాళ్లను పక్కకు తొలగించి ట్రాఫిక్​ను క్లియర్​ చేశారు.

కళ్లెదుటే కొడుకు సజీవ దహనం..

రాజస్థాన్​లోని బోథ్ పూర్ జిల్లాకు చెందిన రాజురామ్​ చౌదరి, ఆయన కొడుకు సర్వర్ రామ్ వేర్వేరు లారీల్లో విజయవాడలోని హనుమాన్ జంక్షన్ నుంచి గుజరాత్‎కు చేపల దాణా లోడ్‎తో బయలు దేరారు. ముందు లారీలో వెళ్తున్న కొడుకుకు తండ్రి తెల్లవారుజామున ఫోన్ చేసి ఎక్కడి వరకు వెళ్లావు అని అడగగా అతను కొద్దిగా ముందున్నానని చెప్పాడు. కొడుకును ఫాలో అవుతూ తండ్రి వెనుక వస్తుండగా రోడ్ ప్రమాదం కనిపించడంతో పాటు మంటల్లో తన కొడుకు మృతిచెందగా ఒక్కసారిగా తండ్రి షాక్‎కు గురయ్యాడు. సర్వర్ రామ్ పెండ్లి జరిగి కేవలం 15 రోజులే అయ్యిందని ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు.