కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బైక్.. ముగ్గురు మృతి

కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బైక్.. ముగ్గురు మృతి

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్నూర్ మండలం మేనూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. 

మంగళవారం (ఏప్రిల్ 7) రాత్రి మద్నూర్ మండలం మేనూర్ గ్రామ శివార్లలో వేగంగా వెళ్తున్న మోటార్ సైకిల్ అదుపుతప్పి లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలతో స్పాట్ లోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది.  

మృతులు మద్నూర్ మండలం, పెద్ద ఎకార్ల గ్రామానికి చెందిన నాగు (50),  సచిన్ (17), జుక్కల్ మండలం  నాగల్గావ్ గ్రామానికి చెందిన అశోక్ (22)గా గుర్తించారు.  నాగు, సచిన్ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో పెద్ద ఎకార్ల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ కళ్లముందే తిరిగిన వారు విగతజీవులుగా పడి ఉండటం చూసి బంధువులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ప్రమాద సమాచారం అందిన వెంటనే మద్నూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.