
కరోనా వైరస్ బారిన పడి తండ్రి, కుమారుడు చనిపోయారు. ఈ సంఘటన మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. వేములవాడ పట్టణానికి చెందిన 45 ఏళ్ల గుమ్మడి ప్రకాశ్ , మధురిమ దంపతులకు అభయ్, అభిజిత్ అనే ఇద్దరు కవల పిల్లలున్నారు. ప్రకాశ్ వేములవాడలోని ప్రభుత్వ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపించడంతో మూడు రోజుల క్రితం వీరంతా కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. అందరికీ పాజిటివ్ వచ్చింది. ప్రకాశ్ కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఆయన మృతి చెందారు. మిగతా ముగ్గురు సిరిసిల్లలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో అభిజిత్ మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఒకే రోజు తండ్రి, కుమారుడు మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది.