
కొండాపూర్, వెలుగు: విద్యుత్ షాక్ తో సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో తండ్రి, కొడుకు చనిపోయారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గొల్లపల్లి గ్రామానికి చెందిన చాకలి మానయ్య(45), చాకలి వెంకటేశం(22) శనివారం ఉదయం తమ పొలంలో బోర్ మోటార్ పైపులను ఇంటి పెడుతుండగా, పైన ఉన్న విద్యుత్ వైర్లకు పైపులు తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయారు. తండ్రి, కొడుకులు విద్యుత్ షాక్తో చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సోమేశ్వర్ తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో కౌలు రైతు..
లింగంపేట: పొలంలోని బోర్ స్టార్టర్ వద్ద కరెంట్ వైర్లను సరి చేస్తుండగా, విద్యుత్ షాక్తో గురై కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ముదెల్లి గ్రామంలో కౌలు రైతు చనిపోయాడు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. ముదెల్లి గ్రామానికి చెందిన పోకల హన్మాండ్లు శనివారం తాను కౌలుకు తీసుకున్న పొలంలో బోర్ మోటార్‌కు కరెంట్ సప్లై కాకపోవడంతో స్టార్టర్ బాక్స్‌లో వైర్లను సరి చేస్తుండగా, షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి భార్య శకుంతల, కూతుళ్లు అంజలి, అఖిల ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.