రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతి

రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతి

రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతి చెందారు. తల్లికి తీవ్ర గాయలయ్యాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట  దగ్గర ఇవాళ (బుధవారం) సాయంత్రం జరిగింది.  కొర్విపల్లి గ్రామానికి చెందిన మాద పోచయ్య, తల్లి రాజవ్వ, తండ్రి బీరయ్యతో కలిసి బైక్ మీద చిన్నశంకరంపేట  మార్కెట్ కు బయల్దేరారు. అంబాజీపేట శివారు దగ్గర మెదక్-చేగుంట దారిలో  మెదక్ వైపు వెళ్తున్న కారు వారి బైక్​ ను ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన మాద పోచయ్య (28)  అక్కడికక్కడే చనిపోగా.. అతని తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా .. మార్గమధ్యంలో బీరయ్య (65) మృతి చెందాడు. రాజవ్వకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. ప్రమాదంలో తండ్రి కొడుకులిద్దరూ మృతి చెందడంతో కొర్విపల్లి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రమాదంలో మృతి చెందిన పోచయ్యకు భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.