కూతురిపై ప్రేమతో.. ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన నాన్న

కూతురిపై ప్రేమతో.. ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన నాన్న

సమాజంలో గుర్తింపు పొందేందుకు జనాలు వేసే వెర్రి వేషాలు అన్నీ ఇన్నీ కావు.  ఒక గిన్నిస్ రికార్డ్ సాధించాలంటే ఎంతో సాహసమైన కార్యాలు చేయాలి. ఇప్పుడు అలానే  యూకేకి చెందిన వ్యక్తి తన కుమార్తె పేరును 667 సార్లు టాటూలు వేయించుకొని ప్రపంచ రికార్డ్ సాధించాడు.

కూతురంటే నాన్నకు ఎనలేని ప్రేమ ఉంటుంది. వారి అనుబంధం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. యూకేకి చెందిన ఓ వ్యక్తికి తన కూతురంటే ఎంత ప్రేమంటే.. ఆమె పేరును 667 సార్లు టాటూలు వేయించుకున్నాడు. ప్రపంచ రికార్డు సాధించాడు. జీవితంలో ఎంతగానో ప్రేమించే వ్యక్తుల పేర్లను పచ్చబొట్టుగా వేసుకుంటారు. అయితే యూకేకి చెందిన 49 సంవత్సరాల మార్క్ ఓవెన్ ఎవాన్స్ శరీరంపై ఒకే పేరును ఎక్కువసార్లు వేయించుకున్న వ్యక్తిగా ప్రపంచ రికార్డుసాధించాడు. అదీ తన కూతురి పేరుని 667 సార్లు టాటూగా వేయించుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. 2017 లో ఓవెన్ ఎవాన్స్ తన కూతురు లూసీ పేరును తన వీపుపై 267 సార్లు టాటూ వేయించుకున్నాడు. అలా అప్పట్లోనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పొందాడు. అయితే 2020 లో USA కి చెందిన 27 సంవత్సరాల డైడ్రా విజిల్ అతని రికార్డును అధిగమిస్తూ 300 టాటూలు వేయించుకుంది.

ఎవాన్స్ తన పాత రికార్డును తిరిగి పొందాలని డిసైడ్ అయ్యాడు. లూసీ అని మరో 400 టాటూలు వేయించుకున్నాడు. దాంతో మొత్తం కలిపి 667 టాటూలుగా మారింది. ఈసారి అతను తొడలపై టాటూలు వేయించుకున్నాడు. ఒక్కో తొడపై 200 చొప్పున 400 టాటూలు వేసినందుకు ఇద్దరు టాటూ ఆర్టిస్టులకు ఐదున్నర గంటల సమయం పట్టింది. మొత్తానికి ఎవాన్స్ కూతురి పేరుతో అత్యధిక టాటూలు వేయించుకుని ప్రేమను చాటుకుంటూనే మరోవైపు ప్రపంచ రికార్డు సైతం సొంతం చేసుకున్నాడు.