వికారాబాద్: తెల్లారితే కూతురు పెళ్లి.. బంధువులంతా ఇంటికి చేరుకున్నారు. వివాహ ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. సున్నం వేసి, రంగులు అద్దిన ఇంటి ఎదుట టెంట్ వేశారు. బంధువులతో ఇల్లంతా సందడిగా ఉంది. అంతలోనే అందిన ఓ విషాద వార్త అందరినీ కన్నీటి సంద్రంలో ముంచింది. తెల్లారితే కూతురు పెళ్లి అంతలోనే తండ్రి చనిపోయిన విషాద ఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంగెంకుర్దులో శనివారం చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. సంగెంకుర్దు గ్రామానికి చెందిన అండాల అనంతప్ప (46)కు వ్యవసాయమే జీవనాధారం. అతని మొదటి భార్య శాకమ్మకు ఓ కూతురు, కొడుకు సంతానం. పదిహేనేళ్ల క్రితం శాకమ్మ చనిపోవడంతో లక్ష్మిని రెండో పెళ్లి చేసుకోగా, ఆమెకు ఓ కొడుకు ఉన్నాడు. ఇదిలా ఉండగా.. మొదటి భార్య కూతురు అవంతిని సొంతూరుకే చెందిన భరత్‌కు ఇచ్చి పెళ్లి చేసేందుకు నిశ్చయించాడు.
2025, నవంబర్ 23 ఆదివారం రోజు వివాహం జరిపించేందుకు అనంతప్ప అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. చిన్నచిన్న పనుల నిమిత్తం శుక్రవారం (నవంబర్ 21) సాయంత్రం యాలాల మండల కేంద్రానికి వెళ్లి తిరిగి వస్తుండగా గ్రామ శివారులో బైక్ అదుపు తప్పి కిందపడ్డాడు. తలకు తీవ్రగాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతన్ని తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు.
మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం (నవంబర్ 22) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు. తెల్లారితే కుమార్తె వివాహం అంతలోనే తండ్రి మృతి చెండటంతో అప్పటివరకు సందడిగా ఉన్న పెళ్లింట ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి. అనంతప్ప కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కూతురు పెళ్లి కోసం వేసిన అదే టెంట్ కింద తండ్రి అంతిమ సంస్కారాలు నిర్వహించిన హృదయవిదారక ఘటన చూసి గ్రామస్తులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.
