రెండు రోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి బాజాలు మోగాలి.. పందిరి కింద బంధుమిత్రుల కోలాహలం ఉండాలి. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఆ పెళ్ళింట విషాద ఛాయలు అలముకున్నాయి. కొడుకు పెళ్లి చూడాల్సిన తండ్రి.. రోడ్డు ప్రమాద రూపంలో అనంత లోకాలకు వెళ్ళిపోయాడు.
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం షేట్‌పల్లి గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దుర్గయ్య కుమారుడి వివాహం మరో రెండు రోజుల్లో జరగాల్సి ఉంది. పెళ్లి పనుల్లో తలమునకలైన దుర్గయ్య సరుకుల కోసం బయటకు వెళ్లారు. అయితే అయ్యపల్లి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న బైక్‌ను వేగంగా వచ్చిన ఒక లారీ బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో దుర్గయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. రెండు రోజుల్లో అంగరంగ వైభవంగా పెళ్లి జరగాల్సిన ఇంట్లో ఇప్పుడు చావు కేకలు వినిపిస్తున్నాయి. పెళ్లి కొడుకుగా ముస్తాబు కావాల్సిన కొడుకు.. తండ్రి మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోతున్న దృశ్యం స్థానికులను సైతం కన్నీరు పెట్టించింది.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో షేట్‌పల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
