పండగకొచ్చిన కూతురిని కాల్చి చంపిన తండ్రి

పండగకొచ్చిన కూతురిని కాల్చి చంపిన తండ్రి

పుట్టింట్లో పండగ జరుపుకోవడం కోసం భర్తతో కలిసి వచ్చిన కూతురును కాల్చి చంపాడో తండ్రి. ఈ దారుణ ఘటన తమిళనాడులో జరిగింది. క్రిష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలోని డెంకణికోట దగ్గర ఉన్న అంచెట్టి కరాడికల్ గ్రామంలో అరుణాచలం, మాధవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి వెంకటలక్ష్మి అలియాస్ లక్ష్మి అనే కూతురుంది. లక్ష్మీకి నాలుగు నెలల క్రితం కర్ణాటకలోని కోలార్ జిల్లా మాలూరు సమీప గ్రామానికి చెందిన శ్రీనివాసన్‌తో వివాహం జరిగింది. ప్రస్తుతం వెంకటలక్ష్మి మూడు నెలల గర్బవతి. ఆంధ్రులు, కన్నడిగులు ఉగాది పండుగ జరుపుకున్న మరుసటి రోజు తమిళ ఉగాది పండుగ వస్తుంది. ఉగాది పండుగకు రావాలని కూతురు వెంకటలక్ష్మి, అల్లుడు శ్రీనివాసన్‌ను అరుణాచలం కోరాడు. దాంతో లక్ష్మీ తన భర్త శ్రీనివాసన్‌తో కలిసి పుట్టింటికి వచ్చింది. అయితే పండుగ మరుసటి రోజు రాత్రి అరుణాచలం మద్యం సేవించి భార్య మాధవితో గొడవపడ్డాడు. ఆగ్రహంతో ఊగిపోయిన అరుణాచలం.. ఇంట్లో ఉన్న తుపాకి తీసుకొని భార్య మాదవి మీద కాల్పులు జరిపాడు. తల్లి మాధవిని కాపాడటానికి కూతురు వెంకటలక్ష్మి తండ్రిని అడ్డుకుంది. దాంతో మద్యం మత్తులో ఉన్న అరుణాచలం నువ్వు, నీ అమ్మ ఒక్కటేనా, ఇద్దరిని కాల్చిపారేస్తా అంటూ తుపాకితో కాల్చాడు. దాంతో ఒక్క క్షణంలో వెంకటలక్ష్మి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పుట్టింట్లో పండుగ జరుపుకోవడానికి భర్తతో కలిసి వచ్చిన వెంకటలక్ష్మి కన్నతండ్రి చేతిలో హత్యకు గురైయ్యింది. కుమార్తె మరణంతో అరుణాచలం అక్కడినుంచి పరారయ్యాడు. వెంకటలక్ష్మి భర్త ఫిర్యాదుతో డెంకణికోట పోలీసులు కేసు నమోదు చేసి అరుణాచలం కోసం గాలిస్తున్నారు.