
పిల్లలను ఏ తండ్రి అయినా గుండెల్లో పెట్లుకొని చూసుకుంటాడు. వారికి ఏదైనా అయితే.. తన ప్రాణం పోయినట్లుగా బాధపడతాడు. అలాంటి ఓ తండ్రి తన సొంత ఐదుగురు పిల్లలను దుర్మార్గంగా చంపేశాడు. ఈ దారుణ ఘటన హర్యానాలో జరిగింది. జింద్‌లోని దిద్వారా గ్రామంలో జూలై 16న 7 మరియు 10 సంవత్సరాల వయసుగల ఇద్దరు బాలికలు తప్పిపోయారు. ఉదయం ఇంట్లో వాళ్లు లేచేసరికి బాలికలు కనిపించలేదు. దాంతో కుటుంబసభ్యులు.. గ్రామస్తులతో కలిసి ఊరంతా వెతికారు. కానీ, వారి జాడ మాత్రం తెలియలేదు. దాంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికల కోసం వెతుకుతుండగా మూడు రోజుల తర్వాత స్థానికంగా ఉన్న హన్సీ బ్రాంచ్ కాలువలో వారి మృతదేహాలు లభ్యమయ్యయని అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ అజిత్ సింగ్ షేఖావత్ తెలిపారు.
కేసు దర్యాప్తులో భాగంగా.. బాలికల తండ్రి జుమ్మా దిన్ ను విచారించగా.. బాలికలను తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. మొదట జుమ్మా దిన్ కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాడని.. కానీ, ఆ తరువాత నేరాన్ని అంగీకరించాడని గ్రామ సర్పంచ్ ప్రమోద్ కుమార్ అన్నారు. నిందితడు గతంలో తన మరో ముగ్గురు పిల్లలను కూడా చంపినట్లు వెల్లడించాడు.
‘నా భర్త ఐదుగురు పిల్లలను చంపాడు. అతడు శిక్షా అర్హుడు. పిల్లలు తప్పిపోయిన రోజున మేం ఉదయం 07:30 గంటలకు నిద్ర లేచాం. కొంత సమయం తరువాత పిల్లల కోసం చూస్తే వారు ఎక్కడా కనిపించలేదు. అందరం పిల్లల కోసం వెతికాం, కానీ.. ఎవరూ దొరకలేదు. మాకు భోజనంలో మత్తుమందు కలపడం వల్ల ఉదయమే నిద్ర లేవలేకపోయాం. గతంలో కూడా అతను మా ముగ్గురు పిల్లలను చంపాడు’అని నిందితుడి భార్య రీనా తెలిపింది. ఈ హత్యలతో జుమ్మా దిన్ తో పాటు మరెవరికైనా ప్రమేయం ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
For More News..