నారాయణపేట జిల్లాలో అమానవీయ ఘటన: కూతురిపై తండ్రి లైంగిక దాడి

నారాయణపేట జిల్లాలో అమానవీయ ఘటన: కూతురిపై తండ్రి లైంగిక దాడి

మరికల్, వెలుగు: మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన తొమ్మిదేండ్ల కూతురిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మరికల్‌‌ మండలంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలం పూసల్‌‌పహాడ్‌‌ గ్రామానికి చెందిన దంపతులకు ముగ్గురు కూతుళ్లు. వీరిలో ఇద్దరు మక్తల్‌‌లోని ప్రభుత్వ హాస్టల్‌‌లో ఉంటుండగా, చిన్న కూతురు గ్రామంలో ఉంటూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. శుక్రవారం బాలిక తల్లి కూలీకి వెళ్లగా.. తండ్రి మేకలు మేపేందుకు వెళ్లాడు.

సాయంత్రం మద్యం మత్తులో ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి.. కూతురిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక అరుపులు బయటకు వినిపించడంతో అటువైపు వెళ్తున్న ఓ వ్యక్తి ఇంట్లోకి వెళ్లి చూసి తండ్రిని పక్కకు నెట్టేశాడు. కొద్దిసేపటి తర్వాత బాలిక తల్లి ఇంటికి రావడంతో జరిగిన విషయం చెప్పింది. బాలికకు రక్తస్రావం అవుతుండడంతో స్థానిక ఆర్‌‌ఎంపీకి చూపించిన అనంతరం మరికల్‌‌లోని ప్రభుత్వ హాస్పిటల్‌‌కు, అక్కడి నుంచి మహబూబ్‌‌నగర్‌‌ హాస్పిటల్‌‌కు తీసుకెళ్లారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో తండ్రిపై కేసు నమోదు చేశామని, అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని ఎస్సై రాము తెలిపారు.