నాలుగేండ్ల పాపను గొంతు పిసికి హత్య చేసిన తండ్రి

నాలుగేండ్ల పాపను గొంతు పిసికి  హత్య చేసిన తండ్రి

నిజామాబాద్, వెలుగు: నాలుగేండ్ల పాపను గొంతు పిసికి హత్యచేశాడు సవతి తండ్రి. నిజామాబాద్  జిల్లా ధర్మోరాలో ఈ దారుణ ఘటన జరిగింది. నిజామాబాద్​కు చెందిన సునీతకు కూతురు ఉంది. సునీత భర్త అనారోగ్యంతో చనిపోయాడు. పుట్టింట్లో ఉంటున్న ఆమెను ఈర్నాల అరుణ్​  ఏడాది కింద వివాహం చేసుకున్నాడు. అతనికి అంతకుముందే పెండ్లయింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి సునీతను  రెండో  పెండ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు సాఫీగానే కాపురం చేశాడు. అయితే, సునీత కూతురు లక్ష్మిని అతను అంగీకరించక గొడవపడుతున్నాడు. 

మూడు నెలల కింద పాపను కొట్టి చేయి విరిచాడు. దీంతో భయపడిన సునీత.. తన కూతురును తన పేరెంట్స్​ సంరక్షణలో నిజామాబాద్​లో పెట్టింది. రెండ్రోజుల కింద భర్త అరుణ్​ను ఒప్పించి పాపను ధర్మోరాకు తీసుకెళ్లింది. గురువారం ఉదయం లక్ష్మి నిద్రపోతుండగా.. సునీత స్నానం చేయడానికి వెళ్లింది. తిరిగి వచ్చే లోపు భర్త అరుణ్​..  పాపను గొంతు పిసికి చంపేశాడు. ముక్కు నుంచి రక్తం కారుతూ అచేతనంగా పడి ఉన్న కూతురును చూసి సునీత ప్రశ్నించగా వడదెబ్బ కొట్టి ఉండవచ్చని అతను బుకాయించాడు. పాపను తీసుకొని సునీత..సమీపంలోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​కు వెళ్లింది. అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు కన్ఫర్మ్​  చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని  పోలీసులు తెలిపారు. నిందితుడు  అరుణ్​ కోసం గాలిస్తున్నామని చెప్పారు.