
హనుమకొండ సిటీ, వెలుగు: విద్యుత్అంతరాయ సమస్యలను తగ్గించి, పరిష్కరించేందుకు ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్లలో వెయ్యి ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. 15 నుంచి 20 కిలోమీటర్ల మేర పొడవుండే లైన్లలో వీటిని అమర్చనున్నట్టు పేర్కొన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ నుంచి16 సర్కిళ్ల ఆఫీసర్లతో శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెలలో 30 సబ్ స్టేషన్లలో రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ ఏర్పాటు చేయాలని, వచ్చే నెలలో మరో 120 సబ్ స్టేషన్లలో పూర్తి చేయాలని ఆదేశించారు.
విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న లూజు లైన్లు, వంగిన, తుప్పు పట్టిన పోల్స్, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ ఫార్మర్లు తదితర సమస్యలను గుర్తించాలని సూచించారు. వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించి, దీనిపై ప్రతి వారం ఉన్నతాధికారులు సమీక్షించాలని అన్నారు. కేబుల్ ఆపరేటర్లు ఉపయోగించే విద్యుత్ స్తంభాలకు రెంట్ వసూలు చేయాలన్నారు. పోల్ నంబరింగ్ ప్రక్రియ వేగంగా చేపట్టాలన్నారు. పొలంబాట చేపట్టి రైతులకు విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో డైరెక్టర్లు టి.మధుసూదన్, సి .ప్రభాకర్, సీఈలు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, కె.తిరుమల్ రావు, రాజు చౌహన్, అశోక్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. .