63 మిల్లుల్లో వడ్లు మాయం.. ఎఫ్సీఐ తాజా తనిఖీల్లో వెల్లడి..

63 మిల్లుల్లో వడ్లు మాయం.. ఎఫ్సీఐ తాజా తనిఖీల్లో వెల్లడి..
  • నిబంధనలు పాటించని మరో 593 మిల్లులు 
  • మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లయ్స్​​కు ఎఫ్​సీఐ లేఖ 
  • ఇప్పటికే మార్చిలో 4.5 లక్షల బస్తాలు మాయమైనట్లు గుర్తింపు 
  • ఆ మిల్లులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలోని మిల్లర్ల బాగోతం మరోసారి బయటపడింది. మార్చిలో చేపట్టిన తనిఖీల్లో 4.5 లక్షల వడ్ల బస్తాలు మాయమైనట్లు గుర్తించిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్​సీఐ)... తాజాగా మేలో చేపట్టిన తనిఖీల్లో మరో లక్షా 37 వేల బస్తాలు మాయమైనట్లు గుర్తించింది. ఈ మేరకు సివిల్ సప్లయ్స్ డిపార్ట్ మెంట్ కు ఎఫ్ సీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అశోక్ కుమార్ మంగళవారం లేఖ రాశారు. మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కస్టమ్‌‌‌‌ మిల్లింగ్‌‌‌‌ రైస్‌‌‌‌ (సీఎంఆర్) డెలివరీలో ఆలస్యం జరుగుతుండడంతో రైస్ మిల్లులపై ఎఫ్​సీఐ దృష్టి పెట్టింది. మిల్లులకు పంపిన మేరకు వడ్లు ఉన్నాయా? ఒకవేళ మిల్లింగ్ చేస్తే బియ్యం నిల్వలు అంత మేరకు ఉన్నాయా? అనే దానిపై తనిఖీలు చేపట్టింది. మార్చిలో 3,278 మిల్లుల్లో తనిఖీలు నిర్వహించగా 40 మిల్లుల్లో 4 లక్షల 53 వేల వడ్ల బస్తాలు మాయమైనట్లు గుర్తించింది. 71 శాతం మిల్లులు నిబంధనలు ఉల్లంఘించినట్లు తేల్చింది. తాజాగా మేలో ప్రత్యేకంగా టీమ్ లను ఏర్పాటు చేసి మిల్లుల్లో ఫిజికల్ వెరికేషన్ చేసింది. 2020–21 యాసంగి, 2021–22 వానాకాలం సీజన్లకు సంబంధించి మిల్లులకు సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ శాఖ అప్పగించిన వడ్ల నిల్వల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించింది. యాసంగికి సంబంధించి 12 మిల్లుల్లో 18,621 బస్తాలు, వానాకాలానికి సంబంధించి 51 మిల్లుల్లో 1,19,251 బస్తాలు మాయమైనట్లు తేల్చింది. మొత్తం 63 మిల్లుల్లో 1,37,872 వడ్ల బస్తాలు మాయమైనట్లు గుర్తించింది. మిల్లర్లు నిబంధనల ప్రకారం ధాన్యం నిల్వ చేయడం లేదని ఎఫ్‌‌‌‌సీఐ ఫైర్ అయింది. తనిఖీల టైమ్ లో రాష్ట్ర వ్యాప్తంగా 593 మిల్లుల్లో నిబంధనలు పాటించకపోవడంతో వెరిఫికేషన్‌‌‌‌ పూర్తి కాలేదు. యాసంగికి సంబంధించి 101 మిల్లులు, వానాకాలానికి సంబంధించి 492 మిల్లుల్లో తనిఖీలకు అనుగుణంగా వడ్ల బస్తాలను క్రమ పద్ధతిలో పెట్టలేదు. దీంతో ఆయా మిల్లుల్లో తనిఖీలు చేయలేదు. 

ఉచిత బియ్యం ఎందుకిస్తలే?  
గరీబ్‌‌‌‌ కల్యాణ్‌‌‌‌ యోజన కింద కేంద్ర ప్రభుత్వం అదనంగా 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నా రాష్ట్రంలో ఎందుకు పంపిణీ చేయడం లేదని ఎఫ్​సీఐ ప్రశ్నించింది. గత రెండు నెలల్లో సెంట్రల్ పూల్ ద్వారా రాష్ట్రానికి 1.90 లక్షల టన్నుల బియ్యం వచ్చాయని, మరి వాటిని లబ్ధిదారులకు ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించింది.

మిల్లర్లపై చర్యలేవీ?  
ధాన్యం షార్టేజ్ ఉన్న, తనిఖీలకు సహకరించకుండా నిబంధనలు పాటించని మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సర్కార్ ను ఎఫ్ సీఐ కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా మిల్లుల వారీగా షార్టేజ్‌‌‌‌ ఉన్న ధాన్యం వివరాలను సివిల్ సప్లయ్స్ డిపార్ట్ మెంట్ కు పంపించింది. మార్చిలో 40 మిల్లుల్లో నాలుగున్నర లక్షల బస్తాలు తేడా వచ్చాయని చెప్పినప్పటికీ, ఆయా మిల్లర్లపై చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. సర్కార్ చర్యలు తీసుకోకపోవడంతోనే ఉల్లంఘనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. మిల్లర్లు దొడ్డిదారిన బియ్యం తరలిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది.