ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు (IGIA) లో గందరగోళం నెలకొంది. 2025, నవంబర్ 07 వ తేదీన ఉదయం ట్రాఫిక్ కంట్రోల్ సిస్టంలో తలెత్తిన టెక్నికల్ సమస్యతో వందకు పైగా విమానాలు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు ఎయిర్ పోర్టులో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
విమానాల రాకపోకలకు సంబంధించి ఆటో ట్రాకింగ్ సిస్టం (ATS) సరిగ్గా పనిచేయకపోవడంతో ఈ సమస్య ఏర్పడినట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ATS కమ్యూనికేషన్ అందించే ఆటోమేటిక్ మెస్సేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ (AMSS) లో గురువారం (నవంబర్ 06) తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా వందలాది ఫ్లైట్స్ ఆగిపోయాయి.
ఆటోమేటిక్ సిస్టం దెబ్బతినటంతో అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది మ్యానువల్ గా విమానాల షెడ్యూల్ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో విమానాల షెడ్యూల్ చాలా ఆలస్యమవుతుందని తెలిపారు. ఈ కారణంగా విమానాల రాకపోకలు ఆలస్యం అవుతాయని తెలిపారు.
ఒక్కో ఫ్లైట్ బయల్దేరటానికి కనీసం 45 నుంచి 50 నిమిషాలు పడుతుందని తెలిపారు. దీనికి సంబంధించి ఉదయం 8.30 తర్వాత ప్యాసెంజర్ అడ్వైజరీ విడుదల చేశారు. ఫ్లైట్స్ కు సంబంధించిన వివరాలను ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్ సైట్ flightrader24 లో చూడాల్సిందిగా సూచించారు.
ఎయిర్ ట్రాఫిక్ సిస్టం సమస్యతో ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా తదితర విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ప్రయాణికులను వీలైన ఇతర ఏర్పాట్లు చేయనున్నట్లు ఆ సంస్థలు ప్రకటించాయి.
విమానాలు నిలిచిపోవడంతో ఎయిర్ పోర్టులో ప్రయాణికులు పెద్ద పెద్ద క్యూ లైన్లలో నిలిచిపోయారు. షెడ్యూల్ మరింత ఆలస్యం అవుతుందన్న ప్రకటనతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. క్లియర్ చేసేందుకు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. ఈ కారణంగా లక్నో, జైపూర్, చండీగఢ్, అమృత్ సర్ విమానాశ్రయాలలో ఉన్న ఫ్లైట్స్ కూడా నిలిచిపోవాల్సి వచ్చింది.
