ధాన్యం లెక్కలు చూపని మిల్లుల నుంచి రైస్ తీసుకోం

ధాన్యం లెక్కలు చూపని మిల్లుల నుంచి రైస్ తీసుకోం

హైదరాబాద్, వెలుగు: ధాన్యం బస్తాల లెక్కలు చెప్పని మిల్లుల నుంచి రైస్ తీసుకోబోమని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్​సీఐ) తెలిపింది. తనిఖీల్లో బస్తాలను లెక్కించలేకుండా.. టార్పాలిన్ కవర్లు కప్పి ఉంచడం, బియ్యం రాశులుగా పోయడం, గదుల్లో బస్తాలు ఇష్టారీతిన పడేసిన మిల్లులను ‘అన్ కౌంటెబుల్’​గా నమోదు చేసుకున్నట్లు పేర్కొంది. అన్ కౌంటెబుల్​గా ఉన్న మిల్లుల నుంచి బియ్యం తీసుకోబోమని రాష్ట్ర సివిల్ సప్లయ్స్ డిపార్ట్​మెంట్​కు తెలియజేసింది. కిందటేడు యాసంగి, ఈ సారి వానాకాలానికి సంబంధించి ప్రభుత్వం సేకరించిన ధాన్యం, ప్రైవేట్ నుంచి ఎంత వచ్చిందనే దానిపై ఎఫ్​సీఐ, సివిల్ సప్లయ్స్ ఆఫీసర్లు తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 2300 మిల్లులను ఫిజికల్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. గురువారం నాటికి 260 మిల్లులు పూర్తవగా.. ఇందులో 40 శాతం మిల్లుల్లో ధాన్యం బస్తాలు అన్ కౌంటెబుల్​గా ఉన్నట్లు తేలింది. పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తే ఎన్ని మిల్లులు ఇట్లున్నయ్.. వాటిల్లో ఏం జరుగుతుందనే ది తెలుస్తుందని ఆఫీసర్లు అన్నారు. తనిఖీలకు వెళ్తున్న ఆఫీసర్లకు మిల్లులు, గోడౌన్లలో సహకారం లభించట్లేదు. లెక్కించడానికి వీల్లేకుండా బస్తాలు అడ్డగోలుగా పెడుతున్నారు. ఎలాంటి అక్రమాలు లేకుండా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఇచ్చినట్టైతే.. మిల్లుల్లో ధాన్యం బస్తాలు లెక్కించేందుకు వీళ్లేకుండా పెట్టాల్సిన అవసరం ఏముంటుంని ఎఫ్​సీఐ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీఎంఆర్ ఇచ్చేందుకు ప్రతిసారి మిల్లులు ఆలస్యం చేస్తున్నాయి. మళ్లీ సీజన్ వచ్చి ధాన్యం సేకరణ జరిగి.. అది మిల్లులకు వస్తున్నా అంతకు ముందు సీజన్ సీఎంఆర్ పూర్తవడం లేదు. ధాన్యం బస్తాల లెక్కింపులో తేడాలు ఎందుకు వస్తున్నాయనే దానిపై ఎఫ్​సీఐ తనిఖీలు చేస్తోంది.

మళ్లీ లెక్కించాకే

ధాన్యం, బియ్యం బస్తాల నిల్వ ఎంత ఉంది? సీఎంఆర్ ఎంత ఇచ్చారో లెక్క చూసుకొని.. అంతా సరిగ్గా ఉంటే వెరిఫైడ్ అని ఆఫీసర్లు ధ్రువీకరిస్తున్నారు. అలాగే లెక్కించలేకుండా బస్తాలు పెట్టిన మిల్లులకు సంబంధించి బియ్యం తీసుకునే ప్రసక్తే లేదని ఎఫ్​సీఐ స్పష్టం చేసింది. బియ్యం ఎఫ్​సీఐ తీసుకోవాలని మిల్లులు అనుకుంటే.. మళ్లీ ఫిజికల్ వెరిఫికేషన్ చేయాల్సిందేనని ధాన్యం బస్తాలు, బియ్యం బస్తాల లెక్క సరిచూసుకోవాల్సిందేనని తెలిపింది. లెక్కల్లో తేడాలు ఉన్నచోట ఎంత గ్యాప్ ఉందో చూస్తున్నారు. అర టన్ను, టన్ను వరకు సాధారణంగా తేడా ఉంటుందని, అంతకంటే ఎక్కువ ఉంటే మిల్లర్లు, సివిల్ సప్లయ్స్ డిపార్ట్​మెంట్ నుంచి వివరణ తీసుకోనున్నారు.

ఇక నుంచి తరచూ తనిఖీలు

ఇక నుంచి ధాన్యం సేకరణ పూర్తయిన తరువాత మిల్లులకు వెళ్తున్న బస్తాలు, అక్కడ సీఎంఆర్​విషయంలో ఎప్పటికప్పుడు తనిఖీలు ఉండేలా ఎఫ్​సీఐ ప్లాన్ చేస్తోంది. ఫలితంగా సీఎంఆర్​ విషయంలో అక్రమాలు జరగకుండా ఉంటాయని భావిస్తోంది.