డబ్బును దాచుకోవడానికి, మంచి లాభాలు పొందడానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD), రికరింగ్ డిపాజిట్ (RD) అనేవి చాలా నమ్మకమైన మార్గాలు. అయితే రూ. 5 లక్షల పెట్టుబడిని 5 ఏళ్ల పాటు 7% వడ్డీ రేటుతో పెట్టడానికి ఏది బెస్టో తెలుసా.... అయితే ఎఫ్‌డీ(FD)లో మన దగ్గర ఉన్న రూ. 5 లక్షలను ఒకేసారి ఒకే విడతగా డిపాజిట్ చేస్తాం. మొదటి రోజు నుంచే పూర్తి మొత్తంపై వడ్డీ పడటం వల్ల చక్రవడ్డీ లాభం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మెచ్యూరిటీ మొత్తం దాదాపు రూ. 7.07 లక్షలు అంటే వచ్చిన వడ్డీ సుమారు రూ. 2.07 లక్షలు
ఆర్డీ (RD) అయితే ఒకేసారి కాకుండా నెలనెలా సేవింగ్స్ చేస్తాం. ఇలా రూ. 5 లక్షలు అవ్వడానికి ఐదేళ్ల పాటు నెలకు రూ. 8,333 చొప్పున కట్టాలి. ఇందులో ప్రతి నెలా కట్టే డబ్బుపైనే వడ్డీ పడుతుంది.. కాబట్టి, ఎఫ్‌డీ కంటే లాభం తక్కువగా ఉంటుంది. మెచ్యూరిటీ మొత్తం దాదాపు రూ. 5.99 లక్షలు అయితే వచ్చిన వడ్డీ సుమారు రూ. 99 వేలు.
పన్ను ప్రయోజనాలు
ఐదేళ్ల కాలపరిమితి ఉన్న 'టాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ'లో పెట్టుబడి పెడితే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ, ఆర్డీలకు ఎలాంటి పన్ను మినహాయింపులు ఉండవు. రెండు డిపాజిట్లలోనూ వచ్చే వడ్డీ సాధారణ ప్రజలకు రూ. 40 వేలు( సీనియర్ సిటిజన్లకు రూ. 50వేలు) దాటితే బ్యాంకులు టీడీఎస్ (TDS) కట్ చేస్తాయి.
ఎవరికి ఏది బెస్ట్?
చేతిలో ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నవారికి, రిటైర్ అయిన సీనియర్ సిటిజన్లకు, పన్ను ఆదా చేసుకోవాలనుకునే వారికి ఎఫ్‌డీ బెస్ట్ ఛాయిస్. దీనిపై అవసరమైతే లోన్ కూడా తీసుకోవచ్చు.
నెలనెలా జీతం వచ్చే ఉద్యోగులకు, ప్రతి నెలా కొద్దికొద్దిగా సేవింగ్స్ చేస్తూ పిల్లల ఫీజులు, పెళ్లిళ్లు, అత్యవసరాల కోసం డబ్బు దాచుకోవాలనుకునే వారికి ఆర్డీ చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువ లాభం, టాక్స్ సేవింగ్ కావాలంటే ఎఫ్‌డీ... నెలనెలా దాచుకోవాలంటే ఆర్డీ బెస్ట్.
