న్యూఢిల్లీ: టీమిండియా 2011 నుంచి 2024 వరకు మేజర్ ఐసీసీ ట్రోఫీ సాధించలేకపోవడానికి స్టార్ బ్యాటర్లలో నెలకొలన్న ఓటమి భయం ఒక కారణం కావచ్చని స్టార్ బ్యాటర్, టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. 2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత మరో వరల్డ్ కప్ కోసం13 ఏండ్లు వేచి చూడాల్సి వస్తుందని తాను ఊహించలేదని పేర్కొన్నాడు.
‘ఒక టీమ్‌గా మేం అన్నీ సవ్యంగానే చేస్తున్నప్పటికీ ఏదో వెలితి ఉండేది. బహుశా అది విఫలమవుతామనే ఆందోళనే అయి ఉండవచ్చు. ప్లేయర్లలో ఆ భయాన్ని పోగొట్టేందుకే కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛను, జట్టులో వారి పాత్రలపై పూర్తి స్పష్టతను ఇచ్చేందుకు ప్రయత్నించాను’ అని జియో హాట్‌స్టార్ షోలో రోహిత్ చెప్పాడు. ఆటగాళ్లతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి పాత్రలపై స్పష్టత ఇవ్వడం వల్లే 2024లో వరల్డ్ కప్ కలను సాకారం చేసుకోగలిగామని వివరించాడు. ఇక, 2019 వన్డే వరల్డ్ కప్‌లో తాను ఐదు సెంచరీలు చేసినా జట్టు గెలవకపోవడం తన ఆలోచనా విధానాన్ని మార్చిందన్నాడు. అప్పటి నుంచి వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పాడు
