శివారు ప్రాంతాల్లో పాముల భయం

శివారు ప్రాంతాల్లో పాముల భయం

హైదరాబాద్, వెలుగు: గత నెలలో భారీ వానలు పడిన తర్వాత నుంచి గ్రేటర్ సిటీలో వాతావరణం వింతగా ఉంటోంది.  ఒక్కోసారి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కొడుతుండగా.. సాయంత్రం తేలికపాటి వాన పడుతోంది. వాతావరణంలో మార్పుల కారణంగా శివారు ప్రాంతాల్లో పాములు బయటకు వస్తుండటంతో స్థానిక జనాలు స్నేక్ రెస్క్యూ టీమ్స్​ను సంప్రదిస్తున్నారు. వానాకాలం మొదలైనప్పటి నుంచి ఫోన్‌‌‌‌ కాల్స్ పెరిగాయని.. ప్రస్తుతం ప్రతిరోజు 100  నుంచి 200కుపైనే  కాల్స్ వస్తున్నాయని రెస్క్యూ టీమ్  సభ్యులు చెప్తున్నారు. శివార్లలో వర్షాలు పడి ఆగిన తర్వాత పాముల బెడద ఎక్కువగా ఉంటోందని వారు అంటున్నారు. కొన్ని రోజులుగా గ్రేటర్​లో వానలు పడిన మరుసటి రోజు  ఎండ కొడుతుండటంతో పాములు బయటకు వస్తున్నాయంటున్నారు.  అవి ఇండ్లల్లోకి కూడా వస్తుండటంతో జనాలు రెస్క్యూ టీమ్​కు కాల్ చేస్తున్నారని వారు చెప్తున్నారు. ఎల్‌‌‌‌బీ నగర్, వనస్థలిపురం, కూకట్‌‌‌‌పల్లి, మియాపూర్, అత్తాపూర్, గచ్చిబౌలి, ఈసీఐఎల్, నాగారం ప్రాంతాల నుంచి ఎక్కువగా ఇలాంటి కాల్స్ వస్తున్నాయని స్కేక్ టీమ్ వలంటీర్లు  చెప్తున్నారు. 

అవగాహన కార్యక్రమాలు.. 
స్నేక్ రెస్క్యూ టీమ్  వలంటీర్లు స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెస్క్యూ నంబర్లను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో అపార్ట్​మెంట్లు, ఇండ్లల్లోకి వచ్చిన పాములను   రెస్క్యూ చేయడానికి వెళ్తున్న సందర్భంలో వాటిని పట్టుకున్న తర్వాత అక్కడి కాలనీవాసులకు అవేర్‌‌‌‌‌‌‌‌నెస్ కల్పిస్తున్నారు. స్టూడెంట్ల ద్వారా ఇంట్లో పెద్దవాళ్లకు రెస్క్యూ ఆపరేషన్స్ గురించి తెలుస్తుందని వారు చెప్తున్నారు. ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్‌‌‌‌తో పాటు జూపార్క్, బొటానికల్ గార్డెన్ వంటి ప్రాంతాల్లోనూ ఈ అవగాహన కార్యక్రమాలను వలంటీర్లు నిర్వహిస్తున్నారు.

గతేడాది 10 వేల పాములను పట్టుకున్నం
శివారు ప్రాంతాల నుంచే  ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తుంటాయి. కిందటేడాది వానా కాలంలో10 వేల పాములను పట్టుకున్నాం. ఫారెస్ట్ డిపార్ట్​మెంట్ అధికారులతో కలిసి పనిచేస్తాం. గతంలో రెస్క్యూ చేసిన పాములను ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో వాటికి కేటాయించిన ప్రాంతంలో వదిలిపెట్టాం. మా టీమ్​లో 150 మంది వలంటీర్లు ఉన్నారు. వారిలో 50 నుంచి 60 మంది పాములను రెస్క్యూ చేయడంలో ఎక్స్‌‌‌‌పర్ట్స్. మిగతావాళ్లు అవేర్‌‌‌‌‌‌‌‌నెస్ కార్యక్రమాలు చేస్తుంటారు.  
‌‌‌‌‌‌‌‌- అవినాశ్, జనరల్ సెక్రటరీ, ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ