తెలంగాణకు బిహార్ కాంగ్రెస్ ​ఎమ్మెల్యేలు

తెలంగాణకు బిహార్ కాంగ్రెస్ ​ఎమ్మెల్యేలు
  • రాష్ట్రానికి బిహార్ కాంగ్రెస్ ​ఎమ్మెల్యేలు
  • నితీశ్ కుమార్ ప్రభుత్వానికి 12న బలపరీక్ష 
  • క్యాంపుకు 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరలింపు

రంగారెడ్డి, వెలుగు: బిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం తెలంగాణలో ఏర్పాటు చేసిన క్యాంపుకు వచ్చారు. బిహార్​లో నితీశ్​కుమార్​ ప్రభుత్వానికి ఈ నెల 12న బలపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీని కాంగ్రెస్​ పార్టీ ఇక్కడికి తరలించింది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం పరిధిలోని కాగజ్ ఘాట్ లో ఉన్న సిరి రిసార్ట్ లో భారీ పోలీసు బందోబస్తు మధ్య వారు బస చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేల బాధ్యతను ఏఐసీసీ సెక్రటరీ సంపత్, స్థానిక ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. నితీశ్ కుమార్ మహాఘట్​బంధన్​నుంచి వైదొలగి ఇటీవల ఎన్డీఏ కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎమ్యెల్యే మద్దతు లేఖలతో ఇటీవల ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. బిహార్​లో ఈ నెల 12వ తేదీ బలపరీక్ష ఉంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సభ్యులు 243 మంది కాగా, ప్రభుత్వం ఏర్పాటుకు 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం పార్టీల వారీగా ఆర్జేడీకి 79 మంది, బీజేపీకి 78 మంది, జేడీయూకు 45, కాంగ్రెస్‌‌‌‌ కు 19, లెఫ్ట్ పార్టీలకు 16, హెచ్ఏఎంకు నలుగురు, ఎంఐఎంకు ఒకరు, ఒక ఇండిపెండెంట్ ఉన్నారు.

రాంచీకి బయల్దేరిన జార్ఖండ్ ఎమ్మెల్యేలు

శంషాబాద్, వెలుగు: రాష్ట్రంలో మూడు రోజుల క్యాంపు ముగించుకుని జేఎంఎం, కాంగ్రెస్​పార్టీలకు చెందిన 38 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో రాంచీకి బయల్దేరారు. ఇన్ని రోజులు వీరు శామీర్ పేట లోని లియోనియా రిసార్ట్ లో బస చేశారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారా ఇన్​చార్జ్​దీపా దాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎమ్మెల్యే మల్​ రెడ్డి రంగారెడ్డి జార్ఖండ్ ఎమ్మెల్యేలను భారీ భద్రత మధ్య శంషాబాద్​విమనానశ్రయానికి తరలించి వీడ్కోలు పలికారు.