ఫీజు, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించండి .. సీఎస్ కు ఆర్.కృష్ణయ్య వినతి

ఫీజు, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించండి .. సీఎస్ కు ఆర్.కృష్ణయ్య వినతి

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 6 వేల కోట్ల ఫీజు, స్కాలర్​షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ సోమవారం సెక్రటేరియెట్ లో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావును ఆర్. కృష్ణయ్య తన బృందంతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫీజుల కోసం బ్యాంక్ ట్రస్ట్ ప్రతిపాదన వద్దని సూచించారు. అనంతరం ఆర్. కృష్ణయ్య మాట్లాడారు.

 ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉన్నత చదువులు మానేసే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్న ఇప్పటివరకు ఒక్క రూపాయి చెల్లించకపోవడం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే రెండు దఫాలుగా రూ.1500 కోట్లు విడుదల చేశారని కానీ, తెలంగాణలో ఫీజులు, స్కాలర్ షిప్ లు విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.

 బ్యాంక్ ట్రస్ట్ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. అలానే చదువుకోడానికి ముందుకు వస్తున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని100 బీసీ కాలేజీ హాస్టల్స్,120 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకుల పాఠశాలకు 20% అదనంగా సీట్లు పెంచాలని కోరారు.