పోలీస్ శాఖలో మహిళా శకం.. ఏటా పెరుగుతున్న విమెన్ పోలీసాఫీసర్లు.. కీలక జోన్లను నడిపిస్తున్నది వారే !

పోలీస్ శాఖలో మహిళా శకం.. ఏటా పెరుగుతున్న విమెన్ పోలీసాఫీసర్లు.. కీలక జోన్లను నడిపిస్తున్నది వారే !
  • ఇప్పటికే కీలక విభాగాల్లో రాణిస్తున్న మహిళా ఐపీఎస్‌‌‌‌లు
  • గ్రూప్‌‌‌‌1 ద్వారా ఎంపికైన 112 మంది  డీఎస్పీ అభ్యర్థుల్లో 38 మంది మహిళలే
  • పోలీస్ అకాడమీలో10 నెలల ట్రైనింగ్‌‌‌‌ ప్రారంభం
  • వచ్చే తరానికి ఆదర్శంగా నిలవాలి: డీజీపీ శివధర్ రెడ్డి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:రాష్ట్ర పోలీస్ శాఖలో మహిళా అధికారుల ప్రాతినిధ్యం పెరుగుతూ వస్తున్నది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సీఐడీ, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌‌‌‌, జైళ్ల శాఖ, పోలీస్ అకాడమీ డైరెక్టర్ సహా సిటీలో కీలక జోన్లను మహిళా ఐపీఎస్‌‌‌‌లు, నాన్ కేడర్‌‌‌‌ అధికారులే ముందుండి నడిపిస్తున్నారు. సైబర్ నేరాలతో పాటు కీలకమైన నేరాలను ఛేదించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరికి మరో 38 మంది యువ మహిళా డీఎస్పీలు తోడు కానున్నారు. 

గ్రూప్‌‌‌‌ 1 ద్వారా ఎంపికైన వీరంతా ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.  అకాడమీలో 112 మంది డీఎస్పీ అభ్యర్థులకు గురువారం నుంచి ట్రైనింగ్ ప్రారంభమైంది. కొత్తగా ఎంపికైన మహిళా డీఎస్పీల్లో చాలామంది మిడిల్​క్లాస్​ నేపథ్యమున్నవాళ్లే ఉన్నారు. శిక్షణ తర్వాత మహిళా పోలీసులుగా తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.

దేశంలోనే మహిళా పోలీసులకు స్ఫూర్తిగా.. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో పోలీస్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో మహిళా అధికారుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఉన్న వారికి కూడా కీలక పోస్టింగ్స్‌‌‌‌ ఇచ్చేవారు కాదు. గతంతో పోల్చితే ప్రస్తుత ప్రభుత్వంలో మహిళల సారథ్యం పెరుగుతూ వస్తున్నది. డైరెక్టర్ జనరల్‌‌‌‌ (డీజీ) స్థాయిలో కీలక విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తూ దేశంలోనే మహిళా పోలీసులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 32 మంది మహిళా పోలీస్ అధికారులు పని చేస్తున్నారు. వీరిలో 29 మంది ఏఎస్పీ స్థాయి నుంచి డీజీ హోదా వరకు వివిధ విభాగాలకు బాస్‌‌‌‌లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్పీగా ఎంపికైన బడుగుల సుమతి ఐపీఎస్‌‌‌‌లకు దీటుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం స్పెషల్‌‌‌‌ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌‌‌‌ చీఫ్‌‌‌‌గా విధులు నిర్వహిస్తున్నారు. విమెన్ సేఫ్టీ వింగ్‌‌‌‌ సహా గతంలో కీలక విభాగాల్లో ఉత్తమ సేవలు అందించారు.      

డైరెక్టర్లుగా ఆ ఆరుగురు సక్సెస్‌‌‌‌..  

రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేసిన నాటి నుంచి శిఖాగోయల్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కీలకమైన విజిలెన్స్ అండ్‌‌‌‌ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా కూడా బాధ్యతలు చేపట్టారు. జైళ్లశాఖ డీజీగా సౌమ్యమిశ్రా ఉత్తమ సేవలు అందిస్తున్నారు. ఖైదీల్లో మార్పు తెచ్చేందుకు జైళ్లలో నూతన సంస్కరణలు తీసుకొస్తున్నారు. తీవ్రమైన నేరాలతో పాటు కీలక కేసుల్లో క్రైమ్‌‌‌‌ ఇన్వెస్టిగేషన్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ కీలక పాత్ర పోషిస్తోంది. ఇదే సీఐడీకి డీజీగా, ఏసీబీ చీఫ్‌‌‌‌గా చారుసిన్హా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

వీరితో పాటు రాష్ట్రంలో విమెన్ సేఫ్టీ వింగ్‌‌‌‌, షీ టీమ్స్ ఏర్పాటైన తరువాత స్వాతి లక్రా ముందుండి నడిపించారు. ప్రస్తుతం ఆమె పోలీస్‌‌‌‌ ఆర్గనైజేషన్‌‌‌‌, హోంగార్డ్స్‌‌‌‌ విభాగాలకు అడిషనల్‌‌‌‌ డీజీగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌‌‌‌కు డీజీగా విధులు నిర్వహిస్తున్నారు. పోలీస్ అకాడమీకి అభిలాష బిస్త్‌‌‌‌  డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతున్నారు. ఆమె ఏపీ కేడర్‌‌‌‌‌‌‌‌కు చెందినప్పటికీ.. రాష్ట్ర పోలీస్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లోనే సేవలు అందించేందుకు క్యాట్‌‌‌‌లో న్యాయ పోరాటం చేశారు.

ఇంతమంది మహిళలు ఎంపికవడం గర్వకారణం: డీజీపీ 

యువ మహిళా డీఎస్పీలు వచ్చే తరానికి ఆదర్శంగా నిలవాలని డీజీపీ శివధర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి పిలుపునిచ్చారు. పోలీస్ శాఖలో మహిళా శకం నడుస్తోందని అన్నారు. గ్రూప్‌‌‌‌ 1 ద్వారా ఎంపికైన వారిలో 38 మంది మహిళా అధికారులు ఉండడం గర్వకారణమని పేర్కొన్నారు. డీఎస్పీలుగా ఎంపికైన 112 మందికి అభినందనలు తెలిపారు. ట్రైనింగ్‌‌‌‌ ప్రారంభం సందర్భంగా ట్రైనీ డీఎస్పీలను ఉద్దేశించి డీజీపీ మాట్లాడారు. దేశంలోనే అగ్రగామిగా నిలిచిన తెలంగాణ పోలీస్ కుటుంబంలో 112 మందితో కూడిన అతి పెద్ద ప్రొబేషనరీ డీఎస్పీల బ్యాచ్ ఇదేనని వెల్లడించారు. 

పది నెలల శిక్షణ కాలంలో వృత్తిపరంగా నాయకత్వ పటిమకు అకాడమీ పునాది వేస్తుందని తెలిపారు. అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్‌‌‌‌ మాట్లాడుతూ.. పది నెలల పాటు జరగనున్న శిక్షణ కార్యక్రమానికి సన్నద్ధులై ఉండాలన్నారు. మొదటి దశలో 42 వారాలపాటు శిక్షణ కొనసాగుతుందని తెలిపారు.  శిక్షణ పొందుతున్న ట్రైనీలు వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో టీజీ సీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ సహా పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.