- వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలో ఘటన
వికారాబాద్, వెలుగు : ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లాలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... ధారూర్ మండలం స్టేషన్ ధారూర్ గ్రామానికి డేగావత్ తులసీబాయి (23) వికారాబాద్ ఎస్పీ ఆఫీస్ ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. తన అన్న రాజుతో పాటు నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన మౌనికతో కలిసి వికారాబాద్‌లోనే ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు.
ఇటీవల రాజు, మౌనికల మధ్య గొడవ జరగడంతో మౌనిక రూమ్ ఖాళీ చేసి వెళ్లిపోయింది. కాగా, రాజు తనను వేధిస్తున్నాడని, అతడికి తులసీబాయి కూడా సహకరిస్తోందని మౌనిక సోమవారం వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా స్టేషన్‌కు వెళ్లిన తులసీబాయిని.. మౌనిక, ఆమె సోదరుడు మధు, స్నేహితుడు శేఖర్ బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన తులసీబాయి బుధవారం ఉదయం స్టేషన్ ధారూర్‌లోని తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ధారూర్ ఎస్సై రాఘవేందర్ తెలిపారు.

