
హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ భార్య, ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనకు సంబంధించి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ శుక్రవారం మహిళ కమిషన్ ముందు అటెండయ్యారు. శుక్రవారం బుద్ధభవన్ లో కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ల శారద ముందు హాజరై..ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో రాత పూర్వకంగా వివరణ ఇచ్చారు. తనకు తెలుగు సరిగా రాకపోవటం వల్లే అలా మాట్లాడానని ఫిరోజ్ ఖాన్ తెలిపారు.
మహిళలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. ఆయన వివరణపై మహిళ కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ న్యూస్ చానల్ తో మాట్లాడుతున్న సమయంలో కేటీఆర్ సతీమణి, ఎమ్మెల్సీ కవిత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఫిరోజ్ ఖాన్ పై మహిళా కమిషన్ అగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులిచ్చింది.