సర్కారు ఫర్టిలిటీ సెంటర్లలో సౌలతుల్లేవ్

సర్కారు ఫర్టిలిటీ సెంటర్లలో సౌలతుల్లేవ్
  • గాంధీ, పేట్లబుర్జు, ఎంజీఎంలోహడావుడిగా సెంటర్లు పెట్టిన గత ప్రభుత్వం
  • రీఏజెంట్స్‌‌‌‌, ఎంబ్రియాలజిస్ట్‌‌‌‌ లేకుండానే ప్రారంభోత్సవాలు 
  • గాంధీ ఐవీఎఫ్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌కు పర్మిషన్ ఇవ్వని కమిషనర్
  • అడ్డగోలుగా దోచుకుంటున్న ప్రైవేట్​ సెంటర్లు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ఇన్‌‌‌‌ఫర్టిలిటీ సమస్య ఏటికేడు పెరుగుతున్నా, ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం ప్రభుత్వ దవాఖాన్లలో సౌలతులు కల్పించడంలేదు. కనీసం ఒక్క ప్రభుత్వ దవాఖానలో కూడా ఇన్‌‌‌‌ఫర్టిలిటీకి చికి త్స అందించే సదుపాయం రాష్ట్రంలో లేదు. దీంతో ప్రైవేటు ఫర్టిలిటీ సెంటర్లు జనాలను అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. రూ.50 వేల నుంచి 80 వేల మధ్య పూర్తయ్యే ఐవీఎఫ్ చికిత్సకు, రూ.3 లక్షల నుంచి 6 లక్షలు చార్జ్ చేస్తున్నాయి. 

ఆరోగ్యశాఖలో కింది స్థా యి నుంచి పైస్థాయి అధికారుల వరకూ తెలిసే ఈ దోపిడీ జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. డీఎంహెచ్‌‌‌‌వోలు, డిప్యూటీ డీఎంహెచ్‌‌‌‌వోలు, ఫర్టిలిటీ సెంటర్ల ఇన్‌‌‌‌స్పెక్షన్‌‌‌‌కు వచ్చే ప్రభుత్వ ప్రొఫెసర్లకు ప్రైవేటు యాజమాన్యాలు లక్షల్లో ముడుపులు ముట్టజెప్పడమే ఇందుకు కారణమన్న ఆరోపణలున్నాయి.  

గాంధీకి నో పర్మిషన్‌‌‌‌

రాష్ట్రంలో ఇన్‌‌‌‌ఫర్టిలిటీ సమస్య తీవ్రత నానాటికీ పెరిగిపోతుండడంతో, ప్రైవేటు ఫర్టిలిటీ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే వందల సంఖ్యలో ఐవీఎఫ్ సెంటర్లు ఉండగా, పది రోజుల క్రితమే కొత్తగా మరో 17 ప్రైవేటు ఫర్టిలిటీ సెంటర్లకు ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కర్ణన్ పర్మిషన్ ఇచ్చారు. గాంధీ హాస్పిటల్‌‌‌‌లో ఐవీఎఫ్ సెంటర్‌‌‌‌‌‌‌‌కు మాత్రం పర్మిషన్ ను నిరాకరించారు. ఇక్కడ ఎంబ్రియాలజిస్ట్ లేనందున పర్మిషన్ నిరాకరించినట్టు తెలిసింది. అయితే, గాంధీ ఐవీఎఫ్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో ఎంబ్రియాలజిస్ట్‌‌‌‌ను నియమించాల్సింది కూడా ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌‌‌‌మెంటే కావడం గమనార్హం.  పర్మిషన్ ఇస్తే, ప్రైవేటు ఫర్టిలిటీ సెంటర్ల గిరాకీ తగ్గుతుందనే భయంతో కొంత మంది లాబీయింగ్ చేసి గాంధీకి పర్మిషన్‌‌‌‌ రాకుండా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 

నిరుపయోగంగా ఎక్విప్‌‌‌‌మెంట్

హైదరాబాద్‌‌‌‌లోని గాంధీ హాస్పిటల్, పేట్లబుర్జు దవాఖాన్లలో, వరంగల్ ఎంజీఎంలో ఫర్టిలిటీ సెంటర్లు పెడుతున్నామని.. ఇక్కడ ఐయూఐ, ఐవీఎఫ్ వంటి ఆధునిక చికిత్సలు కూడా అందిస్తామని 2021లోనే అప్పటి సర్కార్ ప్రకటించింది. రెండేండ్ల సాగదీత తర్వాత గాంధీలో సెంటర్‌‌‌‌‌‌‌‌కు అవసరమైన ఎక్విప్‌‌‌‌మెంట్‌‌‌‌ను కూడా కొనుగోలు చేశారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో.. గతేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌‌‌‌రావు ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌ను హడావుడిగా ప్రారంభించారు. కానీ, ఇప్పటివరకూ అక్కడ ఒక్కరికి కూడా ఐవీఎఫ్‌‌‌‌ చేయలేదు. ఐవీఎఫ్‌‌‌‌ కోసం తమ వద్దకు పేషెంట్లు వస్తున్నా, అవసరమైన రీఏజెంట్స్‌‌‌‌, మందులు ఏవీ గాంధీలో అందుబాటులో లేకపోవడం వల్ల తామేమీ చేయలేకపోతున్నామని డాక్టర్లు చెబుతున్నారు. ఐవీఎఫ్ చేయడానికి అవసరమైన రీఏజెంట్స్, మందులను మెడికల్ కార్పొరేషన్‌‌‌‌ ద్వారా ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌‌‌‌మెంట్ కొనుగోలు చేసి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటివరకూ ఆ పని చే యలేదంటున్నారు.  సెంటర్ నడపడానికి గైనకాలజిస్ట్‌‌‌‌తో పాటు, ఎంబ్రియాలజిస్ట్‌‌‌‌ అవసరం. వీర్యం, అండం కలెక్ట్ చేసి, వాటిని ట్యూబ్‌‌‌‌లో ఫలదీకరణం చెందించే బాధ్యత అంతా ఎంబ్రియాలజిస్టుదే. కానీ, ఎక్కడా ఎంబ్రియాలజిస్టులను నియమించలేదు. 

ఎక్స్‌‌‌‌పైరీకి దగ్గరున్నమందుల కొనుగోలు

కొత్త గవర్నమెంట్ వచ్చాక గాంధీలో ఐయూఐ ప్రొసీజర్లు ప్రారంభించాలని, ఐవీ ఎఫ్‌‌‌‌ ప్రొసీజర్లు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో జనవరిలో ఐయూఐ చేయడానికి అవసరమైన రీ ఏజెంట్స్‌‌‌‌ను గాంధీ హాస్పిటల్‌‌‌‌ డెవలప్‌‌‌‌ మెంట్ ఫండ్స్‌‌‌‌తో కొనుగోలు చేశారు. అయితే, మరో 3 నెలల్లో ఎక్స్‌‌‌‌పైరీ అయ్యే రీఏజెంట్స్‌‌‌‌ను కొనుగోలు చేసినట్టు అక్కడి ఫార్మసిస్టులు  చెప్తున్నారు. ప్రైవేటు ఫార్మా సంస్థలతో కుమ్మక్కై మెడిసిన్‌‌‌‌ కొన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐవీఎఫ్‌‌‌‌ రీఏజెంట్స్‌‌‌‌ మాత్రం ఇప్పటికీ కొనుగోలు చేయలేదు. కనీసం వంద మందికి ఐవీఎఫ్‌‌‌‌ చేయడానికి అవసరమైన రీఏజెంట్స్‌‌‌‌ కోసం జనవరిలోనే మెడికల్ కార్పొ రేషన్‌‌‌‌కు ఇండెంట్ పెట్టామని, ఇప్పటి వరకూ కార్పొరేషన్ నుంచి అవి ఇవ్వలేదని డాక్టర్లు తెలిపారు. ఈలోగా, ఐవీఎఫ్‌‌‌‌ ప్రొసీజర్లు చేయడానికి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్‌‌‌‌‌‌‌‌కు దరఖాస్తు చేయగా.. ఆయన రిజెక్ట్ చేసినట్టు డాక్టర్లు చెబుతున్నారు.