గాంధీలో ఐవీఎఫ్‌‌ ల్యాబ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు

గాంధీలో ఐవీఎఫ్‌‌ ల్యాబ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు

ల్యాబ్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభం

హైదరాబాద్ : గాంధీ దవాఖానలోని ఫెర్టిలిటీ సెంటర్‌‌‌‌లో ఐవీఎఫ్  సౌకర్యం కూడా అందుబాటులోకి తేవాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఓపీ బిల్డింగ్‌‌లోని థర్డ్‌‌ ఫ్లోర్‌‌‌‌లో ఐవీఎఫ్‌‌ ల్యాబ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సెంటర్ ను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు, రూపాయి ఖర్చు లేకుండా ఈ సెంటర్‌‌‌‌లో చికిత్స అందిస్తున్నారు. గాంధీలో ఫెర్టిలిటీ సెంటర్‌‌‌‌ను 2018లో ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖాన్లలో పెట్టిన మొదటి, ఏకైక ఫెర్టిలిటీ సెంటర్ ఇదే. ప్రారంభంలో ఓపీ చూసి మందులు ఇవ్వడం వరకే ఈ సెంటర్ పరిమితమైంది. రెండేళ్ల తర్వాత ఐయూఐ వంటి ప్రొసీజర్లు ప్రారంభించారు. ఇంతలోనే కరోనా రావడంతో ఈ సెంటర్ తాత్కాలికంగా మూతబడింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత, నిరుడు ఆగస్ట్‌‌లో అవుట్ పేషెంట్ సేవలు తిరిగి ప్రారంభించారు. ఈ ఏడాది ఏప్రిల్‌‌ నుంచి సర్జరీలు ప్రారంభించారు. ఇన్‌‌ఫెర్టిలిటీకి కారణమైన సమస్యలను గుర్తించేందుకు చేసే రక్త పరీక్షలు, హెచ్‌‌ఎస్‌‌జీ, ఎల్‌‌ఎస్‌‌జీ వంటి స్కానింగ్స్ అన్నీ ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. ఐయూఐ, హిస్ర్టోల్యాప్రోస్కోపీ, రీకెనలైజేషన్, పీసీవోడీ డ్రిల్లింగ్ వంటి ఖరీదైన ప్రొసీజర్స్ అన్నీ ఉచితంగా చేస్తున్నారు. హిస్ర్టోల్యాప్రోస్కోపిక్ సర్జరీకి ప్రైవేటు హాస్పిటళ్లలో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ చార్జ్ చేస్తున్నారు. గడిచిన నెల రోజుల్లో గాంధీలో 60 మంది మహిళలకు ఈ సర్జరీ ఉచితంగా చేశామని ఫెర్టిలిటీ సెంటర్‌‌‌‌ ఇంచార్జ్‌‌, ప్రొఫెసర్ జానకి తెలిపారు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని, ఆ తర్వాత రకరకాల కారణాలతో మళ్లీ పిల్లలు కావాలని కోరుకునే వాళ్లు రీకెనలైజేషన్ ఆపరేషన్ చేయించుకుంటారు. ఈ ఆపరేషన్‌‌కు ప్రైవేటు హాస్పిటళ్లలో రూ.2 లక్షలకు పైగా చార్జ్ చేస్తున్నారు. గాంధీ ఫెర్టిలిటీ సెంటర్‌‌‌‌లో ఈ ఆపరేషన్‌‌ను ఉచితంగా చేస్తున్నారు. సుమారు 15 మందికి రీకెనలైజేషన్ చేశామని ప్రొఫెసర్ జానకి చెప్పారు. 


ప్రచారం చేయాలె
గాంధీ ఫెర్టిలిటీ సెంటర్‌‌‌‌లో ప్రస్తుతం ఆరుగురు గైనకాలజిస్టులు ఉన్నారు. మూడు రోజుల క్రితమే ఫర్టిలిటీ సెంటర్ కోసం ప్రత్యేకంగా ఓ ఆపరేషన్ థియేటర్ కేటాయించారు. అయితే, ఇక్కడ ఫెర్టిలిటీ సెంటర్ ఉందన్న విషయం ఎక్కువ మందికి తెలియకపోవడంతో ప్రస్తుతం ఇక్కడికి వచ్చే వాళ్ల సంఖ్య తక్కువగా ఉంది. రోజూ 20 నుంచి 30 మంది మాత్రమే ఓపీకి వస్తున్నారు. వీళ్లు కూడా గతంలో ట్రీట్‌‌మెంట్ తీసుకుని సంతానం పొందిన వాళ్లు ఇచ్చిన సమాచారంతోనే ఇక్కడకు వస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఇక్కడ ఒక ఫెర్టిలిటీ సెంటర్ ఉందని, అన్ని రకాల ప్రొసీజర్లు ఉచితంగా చేస్తున్నామని తెలిస్తే ఎక్కువ మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందంటున్నారు.

 

ఐవీఎఫ్​ ఇలా.. 
రాష్ట్రంలో సుమారు 14 నుంచి 20 శాతం జంటలు ఇన్‌‌ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నాయి. ఇదే అదునుగా వందల్లో ప్రైవేటు ఫెర్టిలిటీ సెంటర్లు పుట్టుకొచ్చాయి. పిల్లల కోసం తపిస్తున్న దంపతుల వద్ద లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. హాస్పిటల్‌‌ను బట్టి ఐవీఎఫ్‌‌కు రూ.2 నుంచి 4 లక్షల వరకూ చార్జ్‌‌ చేస్తున్నాయి. ఈ ఖరీదైన ట్రీట్​మెంట్​ చేయించుకోలేక, ఎంతో మంది పేద దంపతులు సంతానానికి నోచుకోవడం లేదు. గాంధీలో దీన్ని ఉచితంగా చేయిస్తే, సంతానం కోసం తపిస్తున్న ఇలాంటి పేద దంపతులకు ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఐవీఎఫ్‌‌ చేయాలంటే భర్త వీర్యకణాలను, భార్య అండాలను సేకరించి వాటిని ప్రాసెస్ చేసి, కృత్రిమ పద్ధతిలో ఫలదీకరణం చెందించాలి. ఆ తర్వాత పిండాన్ని తిరిగి మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెడ్తారు. ఈ మొత్తం ప్రక్రియకు కనీసం 3 వారాల సమయం పడుతుంది.