ఫర్టిలైజర్ యాప్ భేష్..ఉన్నతాధికారుల సమీక్షలో మంత్రి తుమ్మల

ఫర్టిలైజర్ యాప్ భేష్..ఉన్నతాధికారుల సమీక్షలో మంత్రి తుమ్మల
  • మెచ్చుకున్న కేంద్రం
  • వచ్చే వానాకాలం నుంచి అన్ని జిల్లాల్లో అమలు

హైదరాబాద్, వెలుగు: రైతులకు ఎరువుల పంపిణీలో పారదర్శకత, సౌలభ్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన యూరియా యాప్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేంద్ర ఫెర్టిలైజర్ శాఖ మెచ్చుకుంది. దీంతో వచ్చే వానాకాలం సీజన్ నాటికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఫెర్టిలైజర్ యాప్​ను అమలులోకి తేనుంది. అదే విధంగా ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం త్వరలో సర్టిఫికేషన్​ యాప్ -ను తీసుకురానుంది. మంగళవారం సెక్రటేరియెట్​లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్గానిక్ సాగును ప్రోత్సహించాలని, రైతులను ఆ వైపు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్గానిక్ పంటలకు సర్టిఫికేషన్ ఇచ్చేందుకు త్వరలో ప్రత్యేక యాప్ తీసుకురానున్నట్లు వెల్లడించారు. 

ఈ యాప్ ద్వారా కొనుగోలుదారులు ఉత్పత్తి ఎక్కడ, ఏ రైతు దగ్గర నుంచి వచ్చిందో సులభంగా తెలుసుకోగలరని తెలిపారు. నకిలీ ఆర్గానిక్ ఉత్పత్తులతో నిజమైన రైతులకు నష్టం కలుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. అగ్రివర్సిటీలో ఆర్గానిక్ పంటలు పండించి స్టాల్స్ ద్వారా విక్రయించేలా ప్రోత్సహించాలని సూచించారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఇప్పటికే రూ.50 కోట్లు ఖర్చు చేశామని, మరో రూ.50 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 

రైతులకు యంత్రాలు మార్కెట్ ధరలకే అందుబాటులో ఉండేలా, సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేలా నిబంధనలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. వచ్చే సీజన్​కు పెద్ద మొత్తంలో యూరియా స్టాక్ ను నిల్వ ఉంచాలని, రైల్వే రేక్ పాయింట్లను అదనంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంటల సాగు శాటిలైట్ మ్యాపింగ్ ను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని, మూడేండ్ల డేటా సేకరించి, అధికారులతో ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలని సూచించారు. 

రేపటి నుంచి అగ్రి, హార్టికల్చర్ షో

హైదరాబాద్ సిటీలో 19వ ఆలిండియా అగ్రి, హార్టికల్చర్ షో గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 22 నుంచి 26 వరకు ఇది కొనసాగనుంది. ఐమ్యాక్స్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ షో జరగనుంది. ఈ నర్సరీ మేళా బ్రోచర్ ను మంత్రి తుమ్మల మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న మహానగరాల్లో గ్రీనరీ అవసరమని తెలిపారు. షోలో భాగంగా హార్టికల్చర్, అగ్రికల్చర్ ఉత్పతులను ప్రదర్శిస్తామని చెప్పారు. అనంతరం  నర్సరీ మేళా ఇన్ చార్జ్ ఖలీద్ అహ్మద్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నర్సరీ ఉత్పత్తులతో ఆలిండియా హార్టికల్చర్ మేళాను నిర్వహించనున్నట్టు  తెలిపారు. 

టెర్రస్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్ సిస్టమ్ వంటి కొత్త పద్ధతులను ఈ షోలో ప్రదర్శిస్తామని చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మేళా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్లాంట్స్ తో 120 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. రాష్ట్ర మంత్రులు, హార్టికల్చర్ ఉన్నతాధికారులు ఈ మేళాను ప్రారంభిస్తారని ఖలీద్​ అహ్మద్​ వివరించారు.