- ఒక్కో బస్తాపై రూ.300 నుంచి రూ.700 హైక్
- యూరియా, డీఏపీకి లింక్ పెట్టిన కంపెనీలు
- అవసరం లేకున్నా అంటగడుతున్న డీలర్లు
- ట్రాన్స్పోర్ట్ చార్జీలతో యూరియాపై రూ.50 అదనం
మంచిర్యాల, వెలుగు: కాంప్లెక్స్ ఎరువుల రేట్లను కంపెనీలు భారీగా పెంచాయి. ఒక్కో బస్తాపై రూ.300 నుంచి రూ.700 దాక హైక్ చేశాయి. పెరిగిన రేట్లు ఈ నెల నుంచే అమల్లోకి వచ్చాయి. గత వానాకాలం నుంచి ఇప్పటివరకు కాంప్లెక్స్ ఎరువుల రేట్లు పెరగడం ఇది మూడోసారి. ఏదో ఓ సాకుతో కంపెనీలు పోటాపోటీగా ధరలు పెంచడం రైతులకు మింగుడు పడడం లేదు. దీంతో రానున్న వానాకాలం సీజన్లో అన్నదాతలపై అడ్డగోలు భారం పడనుంది. ఇట్లయితే ఎవుసం ఏం చేస్తామని నిట్టూరుస్తున్నారు. కాగా, ప్రభుత్వం సబ్సిడీపై అందించే యూరియా, డీఏపీ రేట్లలో మార్పులు చేయకపోవడం రైతులకు పెద్ద ఊరటగా చెప్పవచ్చు.
వార్ సాకుతో ఇష్టారీతిన పెంపు..
ఓవైపు ఉక్రెయిన్–-రష్యా, మరోవైపు ఇరాన్–-ఇజ్రాయిల్ యుద్ధాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మనదేశంలో ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకులను కంపెనీలు పశ్చిమాసియా దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. యుద్ధం కారణంగా గ్యాస్, పెట్రోల్ సప్లైకి అంతరాయం కలగడం, ట్రాన్స్‌పోర్టు చార్జీలు పెరగడమే కాకుండా రూపాయి మారకం విలువ పడిపోయింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల ఆ ప్రభావం ఎరువుల ఉత్పత్తిపై పడ్డట్టు చెబుతున్నారు. ఈ సాకుతో కంపెనీలు ఎరువుల రేట్లను ఇష్టారీతిన పెంచి రైతులపై భారం మోపాయి.
ఏడాదిలో మూడుసార్లు..
గత వానాకాలం నుంచి ఇప్పటివరకు కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు మూడుసార్లు పెంచాయని ఫర్టిలైజర్స్ డీలర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో అత్యధిక మోతాదులో వినియోగించే 20:20:0:13, ఇతర ఎరువుల రేట్లు బస్తాకు రూ.1,200 నుంచి రూ.1,300 వరకు ఉండగా, యాసంగి సీజ్‌లో రూ.1,500కు పెంచాయి. తాజాగా మరో రూ.300 పెరగడంతో బస్తా ధర రూ.1,800కు చేరింది. 10:26:26 రేటు రూ.2,025 నుంచి రూ.2,2250కి, 19:19:19 ధర 2,075 నుంచి 2,300కు, 12:32:16 రేటు రూ.2,025 నుంచి రూ.2,250కి పెరిగింది. మంచిర్యాల జిల్లాలో వానాకాలం సీజన్లో 36 వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరమవుతాయని అగ్రికల్చర్ అధికారులు తెలిపారు.
యూరియా, డీఏపీకి లింక్
కంపెనీలు యూరియా, డీఏపీ అమ్మకాలతో కాంప్లెక్స్ ఎరువులకు లింక్ పెట్టడం వల్ల ఇటు డీలర్లు, అటు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కంపెనీలు బలవంతంగా కాంప్లెక్స్ ఎరువులను సప్లై చేస్తుండడంతో డీలర్లు రైతులకు అవసరం లేకపోయినా వాటిని అంటగడుతున్నారు. కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా, డీఏపీ ఇస్తామనడంతో కొనుగోలు చేయకతప్పడం లేదని రైతులు వాపోతున్నారు.
మరోవైపు ఫర్టిలైజర్ డీలర్లకు ట్రాన్స్‌పోర్టు చార్జీలు చెల్లించకపోవడంతో ఆ భారాన్ని కూడా రైతులపైనే మోపుతున్నారు. యూరియా బస్తా ధర రూ.265 కాగా, కంపెనీలు డీలర్లకు రూ.15 మాత్రమే మార్జిన్ ఇస్తున్నాయి. ఒక్కో బస్తాకు హమాలీ చార్జీలు రూ.15, ట్రాన్స్‌పోర్టు చార్జీలు రూ.30 నుంచి రూ.35 కలిపి అదనంగా రూ.50 దాక వసూలు చేస్తున్నారు. దీంతో రూ.265 యూరియా బస్తాకు రూ.300కు పైగా రైతులు చెల్లిస్తున్నారు. కంపెనీల తీరును నిరసిస్తూ డీలర్లు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఫర్టిలైజర్ షాపులు బంద్ పెట్టారు.--
కంపెనీల తీరుతో ఇబ్బందులు
కంపెనీలు వివిధ కారణాలతో కాంప్లెక్స్ ఎరువుల ధరలను భారీగా పెంచాయి. ఏడాది కాలంలో ఏకంగా మూడుసార్లు రేట్లు హైక్ చేశాయి. నిరుడితో పోలిస్తే ఒక్కో బస్తాపై రూ.700 వరకు పెంచాయి. అంతే కాకుండా యూరియా, డీఏపీతో కాంప్లెక్స్ ఎరువులకు లింక్ పెట్టాయి. కంపెనీలు ఇచ్చే మార్జిన్ హమాలీ చార్జీలకు కూడా సరిపోదు. ట్రాన్స్‌పోర్టు చార్జీల భారం రైతులపై వేయక తప్పడం లేదు. ఎఫ్వోఎల్ పద్ధతిలోనే ఎరువులను సప్లై చేయాలి. - నగేశ్, ఫర్టిలైజర్స్ అసోసియేషన్, మంచిర్యాల

