వర్ని, వెలుగు : ఫోన్ బ్లాక్ చేసిందన్న కోపంలో ఓ వ్యక్తి మహిళను హత్య చేయగా.. ఈ విషయం తెలుసుకున్న ఆమె బంధువులు యువకుడిపై దాడి చేయడంతో అతడు చనిపోయాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పొట్టిగుట్టలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందూరు మండలం పొట్టిగుట్టతండాకు చెందిన కవిత (36)కు మేడిపల్లి తండాకు చెందిన సంతోష్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు.
సంతోష్ పదేండ్ల కింద రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. తర్వాత కవిత లకావత్ ఆనంద్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో ఆనంద్ అప్పుడప్పుడు పొట్టిగుట్టతండాలోని కవిత ఇంటికి వచ్చి పోయేవాడు. కవిత ఇటీవల ఆనంద్ ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టడంతో అతడు మంగళవారం పొట్టిగుట్టలోని కవిత ఇంటికి వచ్చాడు. ఫోన్ ఎందుకు బ్లాక్ చేశావని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఆనంద్ పారతో కవితపై దాడి చేశాడు.
తీవ్రంగా గాయపడిన కవిత అక్కడికక్కడే చనిపోవడంతో ఆనంద్ పరార్ అయ్యాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు కవితను ఆనందే హత్య చేసినట్లు గుర్తించి.. అతడి కోసం గాలింపు మొదలుపెట్టారు. గ్రామ శివారులో ఆనంద్ కనిపించడంతో రాళ్లు, కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఆనంద్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో చనిపోయాడు.

