కేకేఆర్ కొత్త కెప్టెన్ ఎవరంటే?.. రహానే రిటైర్మెంట్‌తో రేసులో ముగ్గురు స్టార్ ప్లేయర్లు!

కేకేఆర్ కొత్త కెప్టెన్ ఎవరంటే?.. రహానే రిటైర్మెంట్‌తో రేసులో ముగ్గురు స్టార్ ప్లేయర్లు!

KKR New Captain: ఐపీఎల్ 2027 సన్నాహాలు మొదలైన వేళ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) యాజమాన్యానికి ఊహించని షాక్ తగిలింది. జట్టు కెప్టెన్ అజింక్యా రహానే ఆకస్మికంగా అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించడంతో కేకేఆర్ కొత్త సారథి వేటలో పడింది. గత రెండు సీజన్లలో వరుసగా 8, 7 స్థానాలతో నిరాశపరిచిన జట్టును మళ్లీ విజయాల బాట పట్టించేందుకు మేనేజ్‌మెంట్ ముగ్గురి పేర్లను పరిగణలోకి తీసుకుంది. 

రేసులో నంబర్-1: రింకూ భాయ్
కొత్త సారథి రేసులో అందరికంటే ముందు వరుసలో ఉన్న పేరు రింకూ సింగ్. కేకేఆర్ జట్టులో అత్యంత సీనియర్ భారతీయ ఆటగాడైన రింకూ, గత రెండేళ్లుగా రహానే సారథ్యంలో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. యూపీ టీ20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్‌కు టైటిల్ అందించడంతో పాటు యూపీ దేశవాళీ జట్టును విజయవంతంగా నడిపించాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో అందరితో సత్సంబంధాలు ఉండటం, అతడికున్న భారీ ఫ్యాన్ బేస్ ఫ్రాంచైజీకి పెద్ద ప్లస్ పాయింట్.

ఆసీస్ పవర్ హౌస్: కామెరాన్ గ్రీన్
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ కేవలం ఒకే సీజన్‌లో కేకేఆర్‌లో అత్యంత కీలకమైన ఆటగాడిగా మారాడు. ఐపీఎల్ 2026 సెకండ్ హాఫ్ లో 322 పరుగులు చేయడంతో పాటు 7 వికెట్లు పడగొట్టి ఆల్‌రౌండర్ గా సత్తా చాటాడు. కెప్టెన్సీ అనుభవం లేకపోయినా, అతడిలో ఉండే ఆసీస్ మార్క్ దూకుడు జట్టును మళ్లీ ఛాంపియన్‌గా నిలబెట్టడానికి బాగా పని కొస్తుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

ALSO READ : హాకీ జెర్సీపై వివాదం.. సుదర్శన చక్రం డిజైన్‌ ఒకరికి నచ్చింది..

మాస్టర్ స్ట్రోక్ ప్లాన్: అంగ్క్రిష్ రఘువంశీ
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే 22 ఏళ్ల అంగ్క్రిష్ రఘువంశీకి జట్టు పగ్గాలు అప్పగించడం కేకేఆర్‌కు మాస్టర్ స్ట్రోక్ కానుంది. ముంబై అండర్-23 జట్టుకు సారథ్యం వహించి 100 శాతం విజయాల రికార్డు సాధించిన రఘువంశీకి రాబోయే దశాబ్ద కాలం పాటు జట్టును సుదీర్ఘంగా నడిపించే సామర్థ్యం ఉంది. గతంలో ముంబై ఇండియన్స్ యువ రోహిత్ శర్మపై నమ్మకంతో కెప్టెన్సీ అప్పగించి ఎలా చరిత్ర సృష్టించిందో, కేకేఆర్ కూడా రఘువంశీతో అదే ఫార్ములా రిపీట్ చేసే ఛాన్స్ ఉంది.